నిజజీవిత సంఘటనల మేళవింపుతో రామ్‌గోపాల్‌వర్మ అందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘శారీ’. ‘టూమచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనేది ఉపశీర్షిక. గిరి కృష్ణకమల్ దర్శకుడు. రవివర్మ నిర్మాత. నవంబర్‌లో విడుదల కానున్న ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ థియేట్రికల్ హక్కులను ప్రముఖ పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ సొంతం చేసుకున్నారు. చీరలో ఉన్న ఓ అమ్మాయిని చూసి పిచ్చివాడై, ప్రేమలో పడ్డ ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ సినిమా ప్రధానాంశం. ఇందులో అబ్బాయిగా సత్య యాదు నటిస్తుండగా, అతన్ని పిచ్చివాడ్ని చేసిన అమ్మాయిగా ఆరాధ్యదేవి కనిపించనుంది. వాస్తవ సంఘటనలను కళ్లకు కట్టేలా చూపించడంలో ఆర్జీవీ సిద్ధహస్తులనీ, యువతరం మాత్రమే కాకుండా, కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఈ సినిమాను ఆర్జీవీ మలిచారని పంపిణీదారులు ముత్యాల రాందాస్ అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శబరి, నిర్మాణం: ఆర్జీవి ఆర్వి ప్రొడక్షన్స్.