Santhana Prapthirasthu Movie | ప్రేమ, కెరీర్, రిలేషన్షిప్స్ మాత్రమే కాదు, ఈతరం చెప్పలేనంత సున్నితమైన సమస్యలతో కూడా సంఘర్షణ పడుతోంది. అందులో ఒకటి సంతాన లేమి. బయటికి మాట్లాడాలంటే సంకోచం, లోపల వేల సందేహాలు, వందల ఒత్తిడులు. అలాంటి సున్నితమైన విషయాన్ని కథగా మలచుకున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. టీజర్, ట్రైలర్ల్లో వినోదంతో పాటు భావోద్వేగం కనిపించింది. మరి థియేటర్లో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? సంతాన ప్రాప్తిరస్తు పంచిన వినోదం ప్రేక్షకులని హత్తుకుందా ?
కథ : చైతన్య (విక్రాంత్) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఓ ఎగ్జామ్ సెంటర్ లో కల్యాణి (చాందిని చౌదరి) ను చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ దగ్గరౌతారు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్) వీరి ప్రేమని వ్యతిరేకించడంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటారు. త్వరగా బిడ్డని కనేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తాడు చైతు. కాకపోతే పిల్లల విషయంలో తన ప్రయత్నాలు ఫలించవు. దీంతో ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయిస్తాడు. వైద్య పరీక్షలు చేయించుకోగా చైతన్యకి ఓ సమస్య ఉన్నట్లు బయట పడుతుంది. తర్వాత ఏం జరిగింది? తన సమస్య కారణంగా చైతన్య ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు? చివరకు చైతన్య, కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా ?అనేది మిగతా కథ.
విశ్లేషణ: ప్రస్తుతం పెళ్లయిన చాలా జంటలు ఎదుర్కుంటున్న ఓ సున్నితమైన అంశాన్ని ఎలాంటి అసభ్యతకు చోటు లేకుండా క్లీన్ ఎంటర్ టైమెంట్ తో చుపించిన సినిమా ఇది. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ అనుకుంటే కంటెంట్ బోల్డ్ అయిపోయే ప్రమాదం వుంది. కానీ దర్శకుడు కుటుంబం అంతా కలసి చూడదగ్గ సినిమాగా మలిచాడు. హీరో హీరోయిన్ల పరిచయం, ప్రేమ, పెళ్లి సన్నివేశాలన్నీ చకచకగా సాగిపోతాయి. అభినవ్ గోమఠం, తరుణ్ భాస్కర్ పాత్రలు కావాల్సిన వినోదాన్ని పంచుతాయి.
నిజానికి ఈ కథని చాలా వరకూ ట్రైలర్ లోనే రివిల్ చేశారు. ఇలాంటి సినిమాకి ట్రీట్మెంట్ బావుంటే వర్క్ అవుతుంది. ఈ సినిమాలో అలాంటి మంచి ట్రీట్మెంట్ కుదిరింది. కథానాయకుడికి వున్న సమస్య, ఆ సమస్య కారణంగా మామగారి రూపంలో అతని జీవితానికి ఎదురయ్యే సవాళ్ళు.. సెకండ్ హాఫ్ లో కావాల్సిననంత ఎమోషన్ ని పంచుతూ సాగుతాయి. అయితే మామగారికి, హీరో పాత్రకు మధ్య ఉన్న సంఘర్షణ ఇంకాస్త బెటర్ రాసుకోవాల్సింది. ఆ ట్రాక్ కాస్త సాగదీతలా అనిపిస్తుంది. కాకపొతే క్లైమాక్స్ లో చూపించిన ఎమోషన్ మనుసుని హత్తుకుంటుంది.
నటీనటుల నటన: విక్రాంత్ నటన సహజంగా వుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పిస్తాడు. చాందిని చౌదరి మరోసారి ఆకట్టుకుంది. తన నటన ఈ సినిమాకి కలిసొచ్చింది. మురళీధర్ గౌడ్ ఎప్పటిలానే తన యీజ్ చూపించారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వెన్నెల కిశోర్ ట్రాక్ భలే కుదిరింది. ఈ మూడు పాత్రలు కూడా కావాల్సిన నవ్వులు పంచాయి.
టెక్నికల్ గా: కథకు కావాల్సినది సమకూర్చారు నిర్మాతలు. సంగీతం, కెమరా వర్క్ డీసెంట్ గా వుంది. కాకపోతే గుర్తుపెట్టుకునే పాటల లేవు. నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. దర్శకుడు ఈ సినిమాని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రజెంట్ చేయగలిగాడు.
ప్లస్ పాయింట్స్
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్
తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, వెన్నెల కిషోర్ కామెడీ
మైనస్ పాయింట్స్
కొన్ని రొటీన్ సీన్స్
రేటింగ్ : 3/5