పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు రేణూ దేశాయ్. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమాలో నటించిన పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు కూడా. వీరి పిల్లలు అకీరా నందన్, ఆద్య. సినిమాల్లోకి వీళ్ల ఎంట్రీ ఎప్పుడా అని వేచి చూస్తున్నారు మెగా అభిమానులు.
పవన్, రేణు విడిపోయినప్పటికీ వారి ప్రేమకథ గురించి అభిమానుల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ స్వయంగా తమ ప్రేమకథ ఎలా మొదలైందో పంచుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పవన్‌కల్యాణ్‌తో తన ప్రేమబంధం ఎక్కడ, ఎలా ప్రారంభమైంది? అనే విషయాలను పంచుకుంది రేణు. ‘బద్రి’ సినిమా ఆడిషన్స్ సమయంలో ఆమె మొదటిసారి పవన్‌కల్యాణ్‌ని కలిసిందట.
అప్పుడే ‘తమ్ముడు’ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుండటంతో అక్కడే ఆడిషన్స్ జరిగాయి. అక్కడ ఉన్న జనం కొంత హడావుడి పడుతుంటే, హీరో వస్తున్నాడని అనుకుందట రేణు. కానీ ఆ ఆర్భాటం ఏమీ లేకుండా సింపుల్‌గా డైరెక్టర్ వెనకాలే నడిచి వస్తున్న పవన్‌ని చూసి షాక్ అయిందట. అప్పటికే పవన్ స్టార్ హీరో. అంతేకాదు, మెగాస్టార్ తమ్ముడు. కానీ, అంత సాదాగా ఉండటం చూసి పడిపోయానని చెప్పుకొచ్చింది. ఇక, ఆ క్షణమే ఆయనపై అభిమానం ఏర్పడిందనీ, తర్వాత అది ప్రేమగా మారిందనీ అన్నది. నిజానికి అంతా అనుకున్నట్లు పవన్‌కి కోపం ఎక్కువ కాదనీ, ఆయన చాలా కామ్‌గా ఉంటాడనీ, తక్కువగా మాట్లాడతాడనీ చెప్పింది.