Renu Desai | నటిగా, దర్శకురాలిగా సినీనటుల దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తూ వస్తుంది రేణు దేశాయ్. కొంత కాలంగా సరైన పాత్ర కోసం ఎదురు చూస్తున్న ఆమె, చివరిసారిగా ‘టైగర్ నాగేశ్వరరావు’లో కీలక పాత్రలో కనిపించింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆ పాత్రకు రావాల్సిన గుర్తింపు కూడా ఆమెకు రాలేదు. అయినప్పటికీ, నటనపై మళ్లీ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న రేణు ఇప్పుడు మరో కొత్త చిత్రంతో తెరపై బిజీ అవడానికి సిద్ధమయ్యారు.నిర్మాత డి.ఎస్. రావు కుమారుడు సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘16 రోజుల పండగ’.
ఈ చిత్రంలో రేణు దేశాయ్ అత్త పాత్రలో నటిస్తున్నారు. “ఫస్ట్ టైమ్ అత్త పాత్ర చేస్తున్నాను… నా వయసుకు సరిపోతుందా అని మొదట అనిపించింది. కానీ కథ వినగానే చాలా నచ్చింది. ప్రేక్షకులకు తప్పకుండా కొత్తదనం అనిపిస్తుంది,” అని రేణు తెలిపారు. ‘వినాయకుడు’ ఫేమ్ సాయికిరణ్ అడవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. క్లాస్ టచ్ ఉన్న దర్శకుడిగా పేరున్న సాయికిరణ్ ఈ సినిమా కోసం చాలా కాలంగా స్క్రిప్ట్‌పై వర్క్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్-నటి అనసూయ, నటులు కృష్ణుడు, పార్వతీశం, భావన, సత్య కృష్ణ వంటి వారు కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు
ఈ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకు కారణం పూజా కార్యక్రమానికి హాజరైన ఇండస్ట్రీ పెద్దల జాబితా. అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్, మైత్రి రవి, సురేష్ బాబు వంటి టాప్ నిర్మాతలు ఈ వేడుకకు విచ్చేయడం ద్వారా చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ‘పిల్ల జమీందార్’, ‘మిస్టర్ నూకయ్య’, ‘ద్రోణ’ వంటి చిత్రాలను నిర్మించిన డి.ఎస్. రావు ఈసారి కూడా మంచి కంటెంట్‌తో ముందుకువస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… సినిమా టైటిల్ ‘16 రోజుల పండగ’ దర్శకుడు కృష్ణవంశీ సూచన మేరకు ఫైనల్ చేయబడింది. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం రేణు దేశాయ్‌కు మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే అవకాశాలను తెచ్చిపెడుతుందేమో చూడాలి.