Dhamaka Movie | ప్రస్తుతం మాస్ మహరాజా ఆశలన్ని ‘ధమాకా’ పైనే ఉన్నాయి. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత రెండు బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్ రావడంతో రవితేజ మార్కెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఆయనకు హిట్టు పడితేనే మార్కెట్ పుంజుకుంటుంది. అంతేకాకుండా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలకు క్రాక్ పుణ్యమా అని భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. కానీ అవి రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో ‘ధమాకా’ సినిమాకు మాస్‌రాజా స్థాయిలో బిజినెస్ జరుగలేదని సమాచారం.
ఇక ధమాకా సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చిన.. హిట్టు సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఈ సినిమా చూట్టూ పెద్ద వలయమే ఉంది. ధమాకా రిలీజ్‌కు ముందు రోజు విశాల్ ‘లాఠీ’, నయనతార ‘కనెక్ట్’ సినిమాలు విడుదల కానున్నాయి. నిన్న మొన్నటి వరకు లాఠీ సినిమాపై అంతగా అంచనాలు లేవు. కానీ తాజాగా రిలీజైన ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. రొటీన్ యాక్షన్ ఫార్ములానే అయినా.. మాస్ ప్రేక్షకుల్లో విశాల్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఇక కనెక్ట్ మూవీపై అంతగా అంచనాలు లేకపోయిన, హార్రర్ జానర్ కాబట్టి కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చినా జనాలు ఎగబడిపోతారు.
సరే అవి రెండు ముందు రోజే రిలీవుతున్నాయిగా ధమాకాకు పాజిటీవ్ టాక్ వస్తే చాలు.. కలెక్షన్లు అవే వస్తాయి అనుకుంటే పోరపాటే. ఎందుకంటే అదే రోజు నిఖిల్ ’18పేజీస్’తో వస్తున్నాడు. కార్తికేయ-2 వంటి భారీ విజయం తర్వాత నిఖిల్ నుండి సినిమా వస్తుండటంతో దీనిపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పైగా సుకుమార్ కథ అందించడం, గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేయడం వంటివి ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలే. దీనితో పాటుగా అదే రోజున రణ్వీర్ సింగ్ ‘సర్కస్’ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్లు, ట్రైలర్లు రిలీజ్ చేయకపోవడంతో ఈ సినిమా ఉందన్న విషయమే సరిగ్గా తెలియదు. అయితే ఈ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టి మాస్ కామెడీని డీల్ చేయడంలో సిద్ధ హస్తుడు. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే థియేటర్లు పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ నాలుగు సినిమాలు ఒకెత్తయితే ధమాకా ముందు వారం రిలీజ్ కానున్న ‘అవతార్-2’ మరో ఎత్తు. ఇప్పటికే ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సంచలనం సృష్టిస్తుంది. ఇక ఈ సినిమాకు ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా ఆ ఎఫెక్ట్ రెండు మూడు వారాలు ఈజీగా ఉంటుంది. ఇన్నీ సినిమాల మధ్య రవన్న హిట్ సాధించాలంటే చిన్న విషయం కాదు. అయితే సోలోగా వచ్చి హిట్ కొడితే కిక్కే ముంది, పోటీతో వచ్చి హిట్ కొడితేనే కదా కిక్కు అంటూ రవితేజ అభిమానులు ధీమాగా ఉన్నారు.