‘దర్శకురాలు నీరజ ఈ కథ చెప్పినప్పుడు అద్భుతంగా అనిపించింది. ముక్కోణపు ప్రేమకథల్లో ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైన పాయింట్ ఇది. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’ అని చెప్పింది కథానాయిక రాశీఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టిలతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘తెలుసుకదా’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మాతలు. ఈ సందర్భంగా శనివారం రాశీఖన్నా విలేకరులతో ముచ్చటించింది.
ఇప్పటివరకు తాను ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించానని, కానీ ఈ స్టోరీలోని వినూత్నమైన పాయింట్ బాగా ఆకట్టుకుందని చెప్పింది. ‘ఇందులో నా పాత్ర పేరు అంజలి. స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా కనిపిస్తా. డైరెక్టర్ మూడు ప్రధాన పాత్రల్ని అద్భుతంగా డిజైన్ చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేమ, దాని తాలూకు పరిధి గురించి కొత్త విషయాలు తెలుసుకుంటారు’ అని చెప్పింది రాశీఖన్నా.
తనకు స్వతహాగా మైథలాజికల్ సినిమాలు చాలా ఇష్టమని, అలాగే హారర్ స్టోరీస్‌ను కూడా ఇష్టపడతానని ఆమె పేర్కొంది. పవన్‌కల్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రంలో నటించడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని, ఆయన ఫాలోయింగ్ నెక్ట్స్ లెవల్ అంటూ కొనియాడింది రాశీఖన్నా.