Ravi Teja | సినీ పరిశ్రమలో కాలం ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిలబెడుతుందో చెప్పడం కష్టం. ఒకప్పుడు చిన్న పాత్రల్లో కనిపించిన నటులే తర్వాత స్టార్ హీరోలుగా ఎదుగుతుంటారు. అలాగే స్టార్ హీరోలుగా ఉన్నవారు కాలక్రమంలో విభిన్నమైన పాత్రలు చేస్తూ తమ కెరీర్‌ను కొనసాగిస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తున్న ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. దాదాపు 26 ఏళ్ల తర్వాత రవితేజ, జేడీ చక్రవర్తి ఒకే సినిమాలో మరోసారి కలిసి కనిపించబోతున్నారు. అయితే ఈసారి మాత్రం అప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రవితేజ ఇప్పుడు టాలీవుడ్లో మాస్ మహారాజాగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగా.. జేడీ చక్రవర్తి కీలక పాత్రలు, ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
1999లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకు వేళాయెరా’ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో జేడీ చక్రవర్తి స్టార్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అదే సినిమాలో రవితేజ మాత్రం చిన్న సహాయ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత రవితేజ కెరీర్ క్రమంగా మరో మలుపు తిరిగింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ మొదట జేడీ చక్రవర్తి వద్దకు వెళ్లినప్పటికీ.. చివరకు రవితేజ హీరోగా ఆ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రవితేజ కెరీర్‌కు కీలకమైన మలుపుగా నిలిచింది. 2007లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దుబాయ్ శీను’లో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి స్టార్ హీరోగా ఎదిగారు. అదే సినిమాలో జేడీ చక్రవర్తి ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించిన చిన్న పాత్రలో కనిపించారు. ఇలా ఇద్దరి కెరీర్ ప్రయాణాన్ని గమనిస్తే.. కాలంతో పాటు వారి స్థానాలు ఎలా మారాయో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇప్పుడు మరోసారి వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపించనున్నారనే వార్త రావడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా జేడీ చక్రవర్తి రవితేజకు ఎదురుగా ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తే.. ఈ కాంబినేషన్ మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవితేజ ఇంతకుముందు చేయని తరహాలో హారర్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను కలిపి ఈ కథను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.వివేక్ ఆత్రేయకు ఉన్న ప్రత్యేకమైన హ్యూమర్‌తో పాటు మైండ్ గేమ్ తరహా కథనాన్ని రవితేజ ఎనర్జీకి జోడించి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, అనస్వర రాజన్ కథానాయికలుగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరి పాత్రలకు కథలో ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఇప్పటికే వీరి కాంబినేషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.