Maremma | సినిమా ఇండస్ట్రీకి మరో స్టార్ వారసుడు అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మాస్ మహారాజా రవితేజ సొదరుడి కుమారుడు మాధవ్ భూపతి రాజు, ‘మారెమ్మ’ అనే గ్రామీణ యాక్షన్ డ్రామాతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. మాచర్ల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. మాధవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సోమవారం (సెప్టెంబర్ 15) ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది. ఇందులో మాధవ్ గుబురు గడ్డంతో, రగ్గడ్ లుక్‌లో, మాస్ స్టైల్‌తో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా లుంగీ కట్టుకొని కబడ్డీ మైదానంలోకి నడుచుకుంటూ వచ్చే సన్నివేశం.. అతని పాత్ర శక్తివంతమైనదిగా ఉండబోతోందని చెబుతోంది.
‘మారెమ్మ’ సినిమా ఒక పల్లెటూరి నేపథ్యం కలిగిన యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోంది. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా గ్రామీణ వాతావరణంలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో మాధవ్ పూర్తి మాస్ అవతారంలో కనిపించనున్నాడు. తొలి సినిమాలోనే మాధవ్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, మాస్ డైలవరీలతో మంచి ఇంపాక్ట్ చూపించాడు. హీరోగా తన స్థానం సెట్ చేసుకునేందుకు మాధవ్ ఎంతగానో కష్టపడుతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. అతని యాక్షన్, పాత్ర ఇంటెన్సిటీ చూసినవారు, ‘మారెమ్మ’పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్, ఆడియో వివరాలు వెల్లడించనున్నట్టు చిత్రయూనిట్ సమాచారం. ఇక ఈ సినిమా ద్వారా రవితేజ సోదరుని కుమారుడు టాలీవుడ్లో ఎలా నిలదొక్కుకుంటాడన్నది ప్రేక్షకుల ఆసక్తికరంగా గమనిస్తున్నారు.కాగా, హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడే మాధవ్ భూపతి రాజు. మూవీలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తుండగా… వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు.