Madras High Court | నటుడు జయం రవి (రవి మోహన్), ఆయన భార్య ఆర్తి రవిల మధ్య జరుగుతున్న విడాకుల వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్తి రవి దాఖలు చేసిన తాత్కాలిక భరణం కేసులో కుటుంబ సంక్షేమ కోర్టుకు మరికొంత సమయం ఇవ్వాలంటూ జయం రవి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్ ఈ పిటిషన్ను విచారించి, గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే రెండు వారాల వ్యవధిలోనే ఫ్యామిలీ కోర్టు ఈ భరణం పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
2025 ఏప్రిల్ నుంచి జయం రవి తనకు భరణంతో పాటు పిల్లల స్కూల్ ఫీజులను కూడా చెల్లించలేదని, ఈ వ్యవహారంపై త్వరగా విచారణ జరిపించాలని కోరుతూ ఆర్తి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు, రెండు వారాల్లోగా ఈ కేసును తేల్చాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. అయితే, ఈ గడువును పొడిగించాలంటూ జయం రవి మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆర్తి తరపు సీనియర్ న్యాయవాది జె. రవీంద్రన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రవి విజ్ఞప్తిని తిరస్కరిస్తూ, తదుపరి విచారణ కోసం ఫ్యామిలీ కోర్టునే ఆశ్రయించాలని సూచించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, జయం రవి ఇటీవలే రాఘవ లారెన్స్, నివిన్ పౌలీలతో కలిసి ‘బెంజ్’ చిత్రంలో చేరారు. అలాగే తన దర్శకత్వపు డెబ్యూ సినిమా ‘ఆన్ ఆర్డినరీ మ్యాన్’ షూటింగ్లో పాల్గొంటున్నారు. గణేష్ కె బాబు దర్శకత్వంలో ‘కరాటే బాబు’ షూటింగ్ పూర్తి చేసిన ఆయన, జిఎన్డి శ్యామ్ కుమార్తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీటితో పాటు చాలా కాలంగా ఆలస్యమవుతున్న ‘జీని’ మరియు కార్తీక్ యోగి దర్శకత్వంలో రానున్న చిత్రాలు కూడా ఆయన లైన్లో ఉన్నాయి.