Ravi Babu | క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు మరోసారి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే ప్రకటన చేశారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏనుగు తొండం ఘటికాచలం’ సినిమా థియేటర్లకు కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పుడు రవిబాబు తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ పోస్టర్ చూడగానే ఇది సాధారణ సినిమాకాదు, పూర్తిగా భిన్నమైన కథతో రూపొందుతున్న సినిమా అనే ఫీలింగ్ కలుగుతోంది. వింతగా, మిస్టీరియస్‌గా ఉన్న పోస్టర్ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉండబోతుందని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.
రవిబాబు స్టైల్‌కు తగ్గట్టుగా ఈ సినిమా కూడా కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుందనే అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం 10:30 గంటలకు వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమా టైటిల్‌తో పాటు నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను ఒకేసారి బయటపెట్టనున్నారు. దీంతో రవిబాబు అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఈ అప్డేట్ కోసం ఆసక్తి నెలకొంది.ఈ ప్రాజెక్ట్‌ను ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంస్థ, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక బ్యానర్లు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. కంటెంట్‌కు పెద్దపీట వేసే ఈ బ్యానర్ల నుంచి ఒక నాణ్యమైన సినిమా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటివరకు డిఫరెంట్ కాన్సెప్ట్స్, వినూత్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రవిబాబు, ఈసారి కూడా అదే స్థాయిలో ఒక కొత్త క్రైమ్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. రేపు రాబోయే అధికారిక ప్రకటనతో ఈ సినిమాపై ఉన్న ఉత్కంఠ మరింత పెరగడం ఖాయం.