కాలికి గాయమైనా ఏమాత్రం లెక్కచేయకుండా తన తాజా చిత్రం ‘ఛావా’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నది రష్మిక మందన్న. వీల్‌ఛైర్‌లోనే ఆమె ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. వృత్తిపట్ల రష్మిక మందన్న అంకితభావాన్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక మందన్న తాజా పోస్ట్ అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ‘ఈ రోజుల్లో సాటి వ్యక్తులతో దయగా ఉండటం తగ్గిపోతున్నది. నేను మాత్రం అందరి పట్ల దయతో ప్రవర్తిస్తాను. మీరందరూ కూడా అలాగే ఉండండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది రష్మిక మందన్న.
ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె ధరించిన టీ షర్ట్‌పై కూడా ‘కైండ్ఫుల్’ (దయతో) అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రష్మిక మందన్న నటించిన చారిత్రక చిత్రం ‘ఛావా’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. విక్కీకౌశల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని మరాఠీ యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. వీటితో పాటు తెలుగులో కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్బో చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్న.