Rashmika Mandanna | భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్-ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ తాజాగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (Mood of the Nation) సర్వేలో రష్మిక దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గత నాలుగేళ్లుగా ఈ సర్వేలో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను వెనక్కి నెట్టి రష్మిక ఈ నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
కన్నడ చిత్రసీమతో నటిగా ప్రయాణం ప్రారంభించి, తెలుగు, హిందీ భాషల్లో వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో తన మార్కెట్‌ను విస్తరించిన రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆమె, ఆ తర్వాత రణబీర్ కపూర్ సరసన నటించిన ‘యానిమల్’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటారు. ఇటీవల వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ సంచలన విజయం, అలాగే ‘ఛావా’ వంటి భారీ ప్రాజెక్ట్‌లతో ఆమె పాన్-ఇండియా ఇమేజ్ మరింత బలపడింది. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, భాషా బేధాలు లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడంతోనే ఈ అరుదైన మైలురాయి సాధ్యమైందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.