‘ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటే ప్రేమకథ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. తెలుగులో నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే. కానీ తర్వాత ఒప్పుకున్న ఖుషి, హాయ్ నాన్న సినిమాలు ముందు విడుదల అయ్యాయి. రిలీజ్ లేటైనా ఓ కొత్త ప్రేమకథకు సంగీతాన్నందించినందుకు ఆనందంగా ఉంది’ అన్నారు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్. ఆయన స్వరాలందించిన లవ్‌స్టోరీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి జంటగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. నేడు విడుదలకానుంది. గురువారం హేషమ్ అబ్దుల్ వహాబ్ విలేకరులతో మాట్లాడారు. “ది గర్ల్‌ఫ్రెండ్’లో నాలుగు పాటలుంటాయి. ఇండియన్, వెస్ట్రన్ మేళవింపుగా మ్యూజిక్ చేయమని దర్శకుడు రాహుల్ కోరారు. అందుకే మన రాగాలు, వెస్ట్రన్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఈ సినిమాకు ఉపయోగించా’ అని తెలిపారు హేషమ్.
నాయకానాయికలు విక్రమ్, భూమా పాత్రల మధ్య సంఘర్షణే ఈ సినిమాకు మంచి పాటలిచ్చేందుకు స్ఫూర్తినిచ్చిందని, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ప్రేమకథ ఇదని, చూసినవారంతా తప్పకుండా అప్రిషియేట్ చేస్తారని, ఈ క్రెడిట్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్కే దక్కుతుందని హేషమ్ అబ్దుల్ వహాబ్ అభిప్రాయపడ్డారు. ఏ.ఆర్.రెహమాన్ తన అభిమాన సంగీత దర్శకుడని, తెలుగులో కీరవాణి సంగీతమంటే ఇష్టమని, స్వరపరచడం, పాడటం రెండూ తనకిష్టమేనని, అందుకే ఇతర సంగీత దర్శకుల సినిమాల్లోనూ పాడుతున్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాతో పాటు సౌత్‌లోని అన్ని భాషల సినిమాలకూ పనిచేస్తున్నానని హేషమ్ అబ్దుల్ వహాబ్ చెప్పారు.