Rasha Thadani | బాలీవుడ్లో నెలకో స్టార్కిడ్ పరిచయం అవుతున్నారు. అయితే.. వారిలో కొందరు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే, మరికొందరు ట్రోల్స్‌కు గురవుతున్నారు. కానీ, సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని మాత్రం.. మొదటి కోవలోకే వస్తుందని అంటున్నాడు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా. తాజాగా, ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాషా తడానీని ఆకాశానికి ఎత్తాడు. ఆజాద్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాషా.
ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ, ఈ అమ్మడు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. నటనతోపాటు అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇదే విషయాన్ని మీడియాతో పంచుకుంటూ.. పరిశ్రమలో ఇప్పుడున్న వారిలో రాషా మాత్రమే మంచి డ్యాన్సర్‌గా రాణించగలదని అన్నాడు రెమో డిసౌజా.
“ఒక అమ్మాయిని చూశాను. ఆమె డ్యాన్స్ అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో.. ఆమె అద్భుతమైన డ్యాన్సర్‌గా రాణిస్తుందని అనుకుంటున్నా. ఆమే.. రాషా తడాని. ఆమె నటనతోపాటు డ్యాన్స్‌లోనూ అదరగొడుతున్నది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మలైకా అరోరా కూడా.. రెమోతో ఏకీభవించింది. ఆమె కూడా రాషాపై ప్రశంసల వర్షం కురిపించింది. “ఆమె అద్భుతమైన డ్యాన్సర్! ఇండస్ట్రీలోకి వస్తున్న యువనటీనటులు తమను తాము నిరూపించుకోవాలి. రాషా మాత్రం.. ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నది” అంటూ కొనియాడింది.
తన మొదటి చిత్రం ‘ఆజాద్’లో ఉయ్ అమ్మా, బిరంగే పాటల్లో అద్భుతమైన నృత్యంతో ఆకట్టుకున్నది రాషా. తన తల్లి రవీనా టాండన్, గోవిందా 2002లో చేసిన ఐకానిక్ సాంగ్.. ‘అఖియోం సే గోలి మారే’ను ఇటీవల రీ క్రియేట్ చేసింది రాషా. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. రాషా డ్యాన్స్ స్కిల్స్‌కు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు.