Gentleman Driver 2025 | తమిళ అగ్ర కథానాయకుడు, కార్ రేసర్ అజిత్ కుమార్‌కి అరుదైన గౌరవం దక్కింది. సినీ ఐకాన్‌గా తన ప్రయాణంతో పాటు, ప్రొఫెషనల్ రేసర్‌గా ఆయన సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ‘జెంటిల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ (Gentleman Driver of the Year 2025) పురస్కారం లభించింది. ఇటలీలోని వెనిస్ నగరంలో జరిగిన ఈ వేడుకలో ఫిలిప్ చారియోల్ మోటార్‌స్పోర్ట్ గ్రూప్ ఈ గౌరవాన్ని అజిత్‌కు అందించింది. జీటీ రేసింగ్‌లో ప్రపంచ అగ్రగామిగా పరిగణించబడే ఎస్ఆర్ఓ మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ సీఈఓ స్టెఫాన్ రాటెల్ చేతుల మీదుగా అజిత్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో అజిత్‌కు తోడుగా ఆయన సతీమణి నటి శాలిని కూడా ఉంది.
ఈ అవార్డుకి సంబంధించిన క్షణాలను శాలిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. “వ్యవస్థాపకుడు, రేసింగ్ డ్రైవర్ అయిన దివంగత ఫిలిప్ చారియోల్ గౌరవార్థం నా భర్తకు ‘జెంటిల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు అందుతున్న ఈ శుభ సందర్భంలో వెనిస్లో ఆయన పక్కన నిలబడటం గౌరవంగా భావిస్తున్నాను” అని శాలిని రాసుకొచ్చింది.
ఈ పురస్కారం అందుకున్న అనంతరం అజిత్ కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడారు. “ఈ క్షణంలో నేను ఫిలిప్ చారియోల్ను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఆయన చాలా దయగల, అద్భుతమైన వ్యక్తి అని విన్నాను. ఆయన జీవితంలో ఎదురైన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చారని తెలుసుకున్నాను. మోటార్‌స్పోర్ట్ ప్రపంచంలో నా అనుభవం ఎప్పుడూ ఉత్తేజకరంగా, సవాలుతో కూడుకున్నదిగా, మరియు ఆనందదాయకంగా ఉంది అని అజిత్ పేర్కొన్నారు.