Ranveer Singh | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మంగళవారం ఉదయం కర్ణాటకలోని మైసూర్లో గల ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో రణవీర్ సింగ్, నటుడు రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ చిత్రంలోని పవిత్రమైన భూతకోల నృత్యాన్ని అనుకరిస్తూ ప్రదర్శన ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దైవాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడిగుల, దైవ భక్తుల మతాచారాలను, సెంటిమెంట్లను గాయపరిచాయంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడమే కాకుండా, ఒక లాయర్ ఇచ్చిన ఫిర్యాదుతో రణవీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ (FIR) కూడా నమోదైంది. ఈ వివాదంపై రణవీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, తాను ఎవరి భావాలను దెబ్బతీయాలని అలా చేయలేదని, రిషబ్ శెట్టి నటనపై గౌరవంతోనే చేశానని చెబుతూ కోర్టుకు నిరభ్యంతర క్షమాపణలు సమర్పించారు. ఆయన క్షమాపణలను స్వీకరించిన హైకోర్టు, రణవీర్ సింగ్‌పై ఉన్న కేసును కొట్టివేస్తూ, ప్రాయశ్చిత్తంగా నాలుగు వారాల లోపు మైసూర్ చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలని ఆదేశించడంతో, ఆ గడువు ముగిసేలోపే ఆయన అత్యంత రహస్యంగా మైసూర్ చేరుకుని సాధారణ భక్తుడిలా మాస్క్ ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో దాదాపు పది నిమిషాల పాటు గడిపిన రణవీర్ సింగ్‌ను ఆ తర్వాత పూజారులు గుర్తించి ప్రత్యేకంగా సత్కరించారు.
అయితే ఈ ఆలయ దర్శనానికి సరిగ్గా ఒక్క రోజు ముందే రణవీర్ సింగ్‌కు చిత్ర పరిశ్రమ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ప్రతిష్టాత్మక చిత్రం ‘డాన్ 3’ నుండి రణవీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో నిర్మాతలకు దాదాపు 45 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందనే కారణంతో, ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రణవీర్ సింగ్‌తో లైట్‌మెన్, కెమెరామెన్, స్పాట్ బాయ్స్ వంటి ఏ సినీ కార్మికుడూ సహకరించకూడదంటూ ‘సహాయ నిరాకరణ’ నోటీసులు జారీ చేస్తూ నిషేధం విధించింది. ఈ వివాదం సర్దుమణిగే వరకు రణవీర్‌తో ఎవరూ పనిచేయరని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇలా ఒకవైపు ‘కాంతార’ వివాదంలో కోర్టు ఆదేశాల మేరకు చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించడం, మరోవైపు ‘డాన్ 3’ వివాదం కారణంగా బాలీవుడ్ ఫిల్మ్ బాడీ నిషేధాజ్ఞలను ఎదుర్కోవడం ప్రస్తుతం సినిమా పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.