Rani Mukerji | 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అంగరంగా వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో ‘జవాన్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రానికి ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ తమ మొదటి జాతీయ అవార్డులను అందుకున్నారు. అయితే అవార్డుల అందుకున్న అనంతరం షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీల మధ్య ఒక ఆత్మీయ క్షణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షారుఖ్ తన నేషనల్ అవార్డు మెడల్ని మెడలో వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతుండగా.. పక్కనే కూర్చున్న రాణి ముఖర్జీ ఆ విషయాన్ని గమనించి షారుఖ్‌కి సాయం చేసింది. షారుఖ్ మెడల్ని రాణి సరిచేసి అతడి మెడలో వేసింది. ఆ తర్వాత, రాణి తన ఫోన్లో సెల్ఫీ కెమెరాను ఆన్ చేసి, మెడల్ ఎలా ఉందో షారుఖ్‌కు చూపించింది. అనంతరం షారుఖ్ కూడా తనకు మెడల్ వచ్చిందంటూ తన పర్సనల్ మేనేజర్ పూజా దాద్లానీకి చూపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.