భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రామాయణ’పై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెయ్యికోట్లకుపైగా వ్యయంతో రూపొందిస్తున్నారు. రణబీర్‌కపూర్ రాముడిగా, సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తయింది.
ఈ సినిమా కోసం హీరో రణబీర్‌కపూర్ తన జీవన శైలిలో చాలా మార్పులు చేసుకున్నారట. రాముడి పాత్ర తాలూకు పవిత్రతను దృష్టిలో పెట్టుకొని ఆహార విషయాల్లో కఠినమైన నియమాన్ని పాటిస్తూ నిష్టగా ఉంటున్నారట. షూటింగ్ పూర్యయ్యే వరకు మద్యపానానికి దూరంగా ఉంటానని ప్రమాణం చేశారట. అంతేకాదు ఈ సినిమా కోసం పూర్తి శాకాహారిగా మారిపోయి సాత్వికాహారం తీసుకుంటున్నారట.
మరోవైపు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం సాధన చేస్తున్నాడని తెలిసింది. కూతురు రహా పుట్టిన తర్వాత తాను స్మోకింగ్ పూర్తిగా మానేశానని, ఇప్పుడు ‘రామాయణ’ సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తి శాఖాహారిగా మారిపోయానని రణబీర్‌కపూర్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ‘రామాయణ’ గ్లింప్స్ గ్రాఫిక్ హంగులతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ‘రామాయణ’ తొలిభాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది.