Rangasthalam Movie | ఐదేళ్ల క్రితం వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. నటుడిగా రామ్‌చరణ్‌ను మరో స్థాయిలో నిలబెట్టింది. చరణ్ కెరీర్లో ఎన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలున్నా రంగస్థలం మాత్రం ప్రత్యేకం. చిట్టిబాబుగా చరణ్ నటిన వర్ణనాతీతం. ఈ సినిమాతో చరణ్‌కు తిరుగులేని పాపులారిటీ వచ్చింది. ఇక సుక్కు టేకింగ్‌కు అయితే ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ఆయన బ్రిలియంట్ రైటింగ్‌కు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఐదేళ్ల తర్వాత రంగస్థలం మళ్లీ థియేటర్లలోకి రానుంది.
అయితే అది ఇక్కడ కాదు. 3వేలకు పైగా మైల్స్ దూరంలో ఉన్న జపాన్‌లో. మాములుగా సౌత్ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉంది. గతేడాది రిలీజైన ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో జపాన్‌లో చరణ్‌కు విపరీతమైన పాపులారిటీ ఏర్పడింది. ఈ క్రమంలో రంగస్థలం సినిమాను జపాన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 9 నుంచి 11వ తేదీ వరకు జపాన్‌లోని చొగో సిటీలో షో వేస్తున్నారు. దీనికి వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి థియేటర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దాదాపు రూ.216 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది. దేవి ప్రసాద్ పాటలైతే ఓ ఊపు ఊపేశాయి. ఆది పినిశెట్టి కీలకపాత్రలో నటించాడు.