Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ranabaali Movie | చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన వీరుల కథలను వెండితెరపైకి తీసుకొచ్చి, వారి పోరాటాలను నేటి తరానికి పరిచయం చేయడం గొప్ప ప్రయత్నం.
Vijay Devarakonda | చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన వీరుల కథలను వెండితెరపైకి తీసుకొచ్చి, వారి పోరాటాలను నేటి తరానికి పరిచయం చేయడం గొప్ప ప్రయత్నం. ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఆకలి బాధలు, కరువు కాటకాలు, దోపిడీ, అణచివేత వంటి అంశాలను భావోద్వేగాలతో మేళవించి చెప్పడం అంత సులభం కాదు. అలాంటి ఒక మరుగునపడిపోయిన వీరుడి జీవితాన్ని, పోరాటాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రమే ‘రణబాలి’. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రానికి ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. బలమైన చారిత్రక నేపథ్యం, మానవీయ భావోద్వేగాలు, తిరుగుబాటు స్ఫూర్తి కలగలిసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది? భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలని అందుకుందా? రివ్యూలో చూద్దాం.
కథ
బ్రిటిష్ పాలనలో మద్రాస్ ప్రాంతం తీవ్రమైన కరువును చూసిన కాలమది. రాయలసీమ ప్రాంతంలోని సింగనమల ప్రాంతానికి రక్షణగా ఉంటాడు భద్రమల్లన్న స్వామి. ఆ స్వామి ఆశీస్సులతో జన్మిస్తాడు రణబాలి (విజయ్ దేవరకొండ). తన పుట్టుకకు ఓ కారణం ఉంటుంది. తన ప్రజలను కరువు రాక్షసుడి నుంచి కాపాడటం తన కర్తవ్యం. బ్రిటిష్ జనరల్ ఆర్నాల్డ్ వోస్లూ రూపంలో వస్తాడు ఆ కరువు రాక్షసుడు. దేశంలో లేని కరువును సృష్టిస్తాడు. అన్నపూర్ణ అయిన ఈ దేశాన్ని ఆకలి చావులతో అలమటించేలా చేసి, ఇక్కడ పండిన ధాన్యపు రాశులను ఇంగ్లాండ్‌కు రవాణా చేసే పన్నాగం పన్నుతాడు. ఆ బ్రిటిష్ ఆకృత్యాల నుంచి రణబాలి తన ప్రజలను ఎలా రక్షించుకున్నాడు? ప్రజల ఆకలి తీర్చడానికి ఎలాంటి పోరాటం చేశాడనేది మిగతా కథ.
విశ్లేషణ
చరిత్రలో మరుగునపడిపోయిన ఓ వీరుడి కథ ఇది. ఒక వ్యక్తి పోరాటం వెనుక ఉన్న ప్రజల బాధలను, ఆ కాలపు సామాజిక పరిస్థితులను ఆవిష్కరించడంతో పాటు, కథలో భాగంగా భద్రమల్లన్న జానపద గాథను దర్శకుడు మేళవించిన తీరు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. ‘రణబాలి’లో ప్రధానంగా ఆకట్టుకునేది కథాంశం. దాని వెనుక ఉన్న మానవీయ కోణం. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో హృదయానికి హత్తుకునేలా చూపించారు. కరువు కారణంగా ఆకలితో అలమటించే ప్రజలు, తమ కుటుంబాలను కాపాడుకోవడానికి వారు పడే తపన, జీవనం కోసం చేసే పోరాటం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. తెరపై కనిపించే సన్నివేశాలు, ప్రజల కన్నీళ్లు, వారి దుర్భర జీవితాలను ప్రతిబింబించే సన్నివేశాలు కథకు వాస్తవికతను తీసుకొస్తాయి. చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ చిత్రానికి ప్రత్యేకతను తీసుకొస్తుంది.
రణబాలి పుట్టుక, భద్రమల్లన్న నేపథ్యం, ఊర్లో జాతర, అక్కడ రణబాలిపై జరిగిన దాడి, తొలి యాక్షన్ ఘట్టం.. ఇవన్నీ ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తాయి. జయమ్మ పాత్రలో రష్మిక పరిచయం, పెళ్లి తర్వాత వచ్చే సన్నివేశాలు హత్తుకునేలా ఉంటాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుంది.
ఇంటర్వెల్ తర్వాత కూడా కథ మరింత తీవ్రతతో సాగుతుంది. బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకున్న ఆహారాన్ని రణబాలి తిరిగి తీసుకొచ్చి ప్రజలకు అందించే ఎపిసోడ్లో అతని పోరాట స్ఫూర్తి మరో స్థాయిలో నిలుస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కదిలిస్తాయి. ఈ సన్నివేశాలు కథలోని మానవీయ భావోద్వేగాలను మరింత అందంగా ఆవిష్కరిస్తాయి. ఇక చివర్లో భద్రమల్లన్న స్వామి పాత్రను ఉపయోగించుకున్న తీరు థియేటర్లలో పూనకం తెప్పిస్తుంది.
నటీనటుల నటన
రణబాలి పాత్ర విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. నటుడిగా తనను మరో స్థాయిలో నిలబెట్టిన ప్రదర్శన కనబరిచారు. పాత్రలోని తీవ్రత, ఆవేశం, పోరాట స్ఫూర్తిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సందర్భాల్లోనూ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రష్మిక జయమ్మ పాత్రలో సహజంగా కనిపిస్తూ మెప్పించారు. విజయ్ దేవరకొండతో ఆమెకు సంబంధించిన సన్నివేశాలు అందంగా, హత్తుకునే భావోద్వేగాలతో సాగుతాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మంచి ఆకర్షణగా నిలుస్తుంది. ఈశ్వరి రావు పాత్ర కథకు మరింత బలాన్ని తెచ్చింది. బ్రిటిష్ జనరల్ ఆర్నాల్డ్ వోస్లూ పాత్రలో కావాల్సిన క్రూరత్వం కనిపించింది. కథలోని సామాజిక, చారిత్రక నేపథ్యానికి అనుగుణంగా మిగతా పాత్రలు కూడా తమ వంతు సహకారం అందించాయి.
టెక్నికల్ విభాగం
చరిత్రలో మరుగునపడిపోయిన ఒక వీరుడి కథను ఎంచుకోవడం, దాని వెనుక ఉన్న సామాజిక పరిస్థితులను తెరపైకి తీసుకురావడంలో రాహుల్ సాంకృత్యన్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. ప్రజల బాధలు, తిరుగుబాటు స్ఫూర్తి, జానపద గాథ వంటి భిన్నమైన అంశాలను ఒకే కథలో చక్కగా మేళవించారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలను హృద్యంగా తెరకెక్కించడం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను సంభాషణలు, సంఘటనల ద్వారా వాస్తవానికి దగ్గరగా తీయడం అభినందనీయం. చారిత్రక నేపథ్యానికి తగిన నిర్మాణ విలువలతో సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. కెమెరా వర్క్ కూడా టాప్ క్వాలిటీతో ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండొచ్చు. అలాగే, అజయ్–అతుల్ కొన్ని చోట్ల మరింత బలంగా నేపథ్య సంగీతాన్ని ఇచ్చే అవకాశాన్ని చేజార్చుకున్నారనిపించింది.
ప్లస్ పాయింట్స్
• బలమైన చారిత్రక కథాంశం
• విజయ్ దేవరకొండ పవర్ఫుల్ నటన
• విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న సన్నివేశాలు
• ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్
• భావోద్వేగ ఘట్టాలు
• భద్రమల్లన్న జానపద గాథ
మైనస్ పాయింట్స్
• అక్కడక్కడా నెమ్మదైన కథనం
• నేపథ్య సంగీతం
ఫైనల్‌గా: చరిత్రలో జరిగిన సంఘటనలను కమర్షియల్ హిస్టారికల్ ఫిక్షన్‌గా మలిచిన తీరు ఆద్యంతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, రాహుల్ సాంకృత్యన్ కెరీర్లలో ఈ చిత్రం గుర్తుండిపోయే స్థానాన్ని సంపాదించుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే అవకాశం పుష్కలంగా ఉంది.
రేటింగ్: 3.5/ 5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

