Ranabaali | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. వీరిద్దరి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌కు తోడు.. పీరియడ్ నేపథ్యం, భారీ యాక్షన్ సన్నివేశాలు, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న విధానం సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ‘రణబాలి’ ట్రైలర్‌ను ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాదాపు 3 నిమిషాల 47 సెకన్ల నిడివితో ఉండనున్న ఈ ట్రైలర్ సాయంత్రం 6:03 గంటలకు డిజిటల్‌గా విడుదల కానుంది. అయితే ట్రైలర్‌ను కేవలం ఆన్లైన్లో విడుదల చేయకుండా.. మీడియా సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిత్రబృందం విలేకరుల సమావేశంలో పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో సినిమా ప్రధాన తారాగణం, సాంకేతిక బృందం పాల్గొని ‘రణబాలి’ విశేషాలను మీడియాతో పంచుకోనున్నారు.
‘రణనబాలి’ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాణ విలువలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. పలు భాషల్లో విడుదల చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సినిమాను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. పీరియడ్ నేపథ్యానికి తగ్గట్టుగా సంగీతాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది.