Rana Naidu 2 | దగ్గబాటి వెంకటేష్, రానా ప్రధాన పాత్రలలో రూపొందిన వెబ్ సిరీస్ రానా నాయుడు ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 కోసం ఫ్యాన్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రానా నాయుడు సీజన్ 2కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇందులో వినోదం, థ్రిల్లింగ్ అంశాలు అంచనాలని పెంచేశాయి. ‘రానా నాయుడు సీజన్ 2’లో నాగ నాయుడుగా వెంకటేష్ దగ్గుబాటి సందడి చేయనున్నారు. వెంకటేష్, నాగ నాయుడుకి చాలా తేడా ఉంటుంది. నాగ నాయుడు స్వార్థపరుడు, నియమాలను ఉల్లంఘిస్తుంటాడు. కానీ నిజ జీవితంలో వెంకటేష్ మాత్రం ఇలాంటి వాటన్నంటికీ దూరంగా ఉంటారు.
రానా నాయుడు సీజన్ 2 మొత్తం యాక్షన్, డ్రామాతో నిండి ఉంటుంది. నాగ నాయుడు 2.0 పూర్తి స్థాయి ధమాకాను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. రానా నాయుడు సీజన్ 2 జూన్ 13 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం ట్రైలర్ విడుదల చేశారు.తొలి పార్ట్‌లో కాస్త బోల్డ్ కంటెంట్ ఉందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీక్వెల్లో కాస్త దానిని తగ్గించారు. ఇది అమెరికర్ క్రైమ్ డ్రామా సిరీస్ రే డోనోవన్ ఆధారంగా రూపొందించబడింది. గత ఏడాది విడుదలైన రానా నాయుడు సిరీస్‌కి సీక్వెల్‌గా దీనిని రూపొందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఇది విడుదల కానుంది.
ఈ క్రేజీ సిరీస్‌ని కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా తెరకెక్కిస్తుండగా, సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ మీడియా నిర్మిస్తుంది. అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్భంద, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినోమోరియా తదతరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. రియల్ లైఫ్ లో బాబాయి అబ్బాయిలైన వెంకటేష్, రానాలు తొలిసారి ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఓ పాటలో కలిసి ఆడిపాడారు. ఆ తర్వాత సినిమా కోసం కాకుండా.. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో ఈ బాబాయి అబ్బాయిలు తండ్రి తనయులుగా నటించి దగ్గుబాటి అభిమానులను అలరించారు. ఈ సారి రెండో సీజన్ అంతకు మించి ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అవుతుండగా, ఇందులో తమ నటనతో ప్రేక్షకులని మంత్ర ముగ్ధులు చేయబోతున్నారు.