హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుబాటి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. చైనాకు చెందిన జంగ్లీ రమ్మీ ప్రమోట్ చేసిన రానాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. ప్రధానంగా చైనా కేంద్రంగా నిర్వహించిన జంగ్లీ రమ్మీని ప్రమోట్ చేసేందుకు ఎంత డబ్బు తీసుకున్నారు? దానిని ఏ రూపంలో తీసుకున్నారు? అని ప్రశ్నించినట్టు సమాచారం. పలు బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో జరిగిన అగ్రిమెంట్లు, అకౌంట్లలో డిపాజిట్స్‌పై కూడా ఈడీ అధికారులు లోతుగా ప్రశ్నించినట్టు తెలిసింది.
ఈడీ ఆదేశాల మేరకు బషీర్‌బాగ్‌లోని ఈడీ జోనల్ కార్యాలయానికి ఉదయం 10.45 గంటలకు చేరుకున్న ఆయనను మధ్యాహ్నం 3గంటల వరకూ ఈడీ అధికారులు విచారించారు. జంగ్లీ రమ్మీ యాప్స్ ప్రమోట్ చేసేందుకు చేసుకున్న అగ్రిమెంట్లు, గత మూడేండ్లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించినట్టు సమాచా రం. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు ఖా తాల్లో పలు అనుమానాస్పద లావాదేవీల గుర్తించినట్టు తెలిసింది. ఇదే కేసులో బుధవారం మంచు లక్ష్మీ విచారణకు హాజరుకావాల్సి ఉంది.
ఇదే కేసులో జులై 30న ప్రకాశ్‌రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండలను ఈడీ విచారించింది. చైనా బెట్టింగ్ యాప్స్ ఇండియాలో పలు కంపెనీలు ఆపరేట్ చేస్తున్నాయి. వీటితో రానా దగ్గుబాటి సహా సెలబ్రిటీలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే యాప్స్ కంపెనీల నుంచి అందిన పారితోషికం సహా రానా అకౌంట్లలో పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీంచినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీల అకౌంట్లలో పెద్ద మొత్తంలో అయిన డిపాజిట్లు, ఇతర ఖాతాలకు నగదు బదిలీపై విశ్లేషణ చేస్తున్నారు.