Raanjhanaa Re-release | బాలీవుడ్ క్లాసిక్ చిత్రాలలో ఒకటైన రాంఝనా (Raanjhanaa) సినిమా క్లైమాక్స్‌ని ఇటీవల AI ద్వారా మార్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా తమిళ వెర్షన్ క్లైమాక్స్‌లో ధనుష్ చనిపోతే అతడిని ఏఐతో బ్రతికించారు మేకర్స్. దీంతో ఈ విషయం తెలిసిన చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో పాటు నటుడు ధనుష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నధనుష్తో పాటు దర్శకుడు చట్టపరమైన చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తుంది.
ఏఐని వాడి నటీనటుల అనుమతి లేకుండా వారి నటనను మార్చడం సరికాదని.. ఇది నైతిక, చట్టపరమైన సమస్యలను సృష్టిస్తుందని రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఇతర సినిమాలకు కూడా ఇది చెడు ఉదాహరణ అవుతుందని హెచ్చరించారు. ధనుష్ కూడా ఈ విషయంపై న్యాయపరమైన చర్యలకు దిగబోతున్నట్లు తెలుస్తుంది.
తమిళ నటుడు ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాంఝనా (Raanjhanaa). సోనమ్ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా 2013లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషాదకరంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో ధనుష్ పోషించిన పాత్ర చివరికి మరణిస్తుంది. దీంతో ఈ క్లైమాక్స్ తమిళ ప్రజలకు నచ్చలేదని అందుకే సినిమా క్లైమాక్స్‌ని (AI) ద్వారా మార్చి సంతోషకరమైన ముగింపుతో రీ రిలీజ్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఈ విషయంపై ఆనంద్ ఎల్ రాయ్ స్పందిస్తూ.. ఈ సినిమా క్లైమాక్స్‌ను మార్చడం అంటే ఆ చిత్ర ఆత్మను చంపేయడమే అని.. గత 12 సంవత్సరాలుగా ఈ సినిమాను గుండెల్లో పెట్టుకున్న అభిమానుల నమ్మకాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అని ఆయన పేర్కొన్నారు.