భారతీయ పురాణేతిహాసం రామాయణం దశాబ్దాలుగా వెండితెరపై ప్రేక్షకుల నీరాజనాలందుకుంటున్నది. తరాలు మారినా ఈ అజరామర కావ్యానికి వెండితెరపై ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హిందీ తాజా ‘రామాయణం’ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా సినిమా తాలూకు బిగ్ అప్డేట్ను పంచుకున్నారు.
అపారమైన బాధ్యత, భక్తి శ్రద్ధలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా ‘రామ’ పేరుతో గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నానమి తెలిపారు. ‘రామాయణం’ చిత్రంలో యష్ (రావణుడు), సన్నీ డియోల్ (హనుమంతుడు), రవి దూబే (లక్ష్మణుడు) పాత్రల్ని పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్, యష్ మాస్టర్‌మైండ్ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామ్యంలో రెండు భాగాలుగా ఐమ్యాక్స్ ఫార్మాట్లో ఈ చిత్రం విడుదల కానుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నారు.