Ramayana | టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన కాజల్ అగర్వాల్, వివాహం అనంతరం సినిమాల ఎంపికలో మార్పులు చేస్తూ, ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో భాగమవుతున్నారు. ఇటీవల భగవంత్ కేసరి, కన్నప్ప వంటి చిత్రాల్లో నటించిన ఆమె, ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న రామాయణ సినిమాలో భాగమవుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్నారు. పురాణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా ఆమె రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో నటిస్తున్నారని వస్తున్న వార్తలను తాజాగా ఆమె స్వయంగా ధృవీకరించారు.
రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా కాజల్ అగర్వాల్ ‘రామాయణం’ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “ప్రతి తరం శ్రీరాముడి పేరుతోనే పెరిగింది. ఇప్పుడు యావత్ ప్రపంచం మర్యాద పురుషోత్తముడైన ఆ రాముడిని దర్శించుకోనుంది. ఇలాంటి గొప్ప సినిమాలో భాగమవడం నాకు గర్వంగా ఉంది” అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అలాగే సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో, యష్ రావణాసురుడిగా కనిపించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది.
‘రామాయణం’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయనుండగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఏది ఏమైన, కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో కనిపించనున్న వార్త అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఆమె నటనపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.