Ramayana Movie | బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. రామాయణం కేవలం ఒక కథ కాదని, అది మన సంస్కృతికి, మన సత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని దగ్గర చేసే కథ.. రామాయణంతో, మేము చరిత్రను తిరిగి చెప్పడం మాత్రమే కాదు; మేము మా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము. మనం ఇంతకు ముందు తీసిన చాలా రామాయణం సినిమాలను చూశాం. కానీ ఈ వెర్షన్ వాటి కంటే భిన్నంగా ఉండబోతుందంటూ నమిత్ చెప్పుకోచ్చాడు.
‘రామాయణం’ చిత్రం “ది ఇంట్రడక్షన్” పేరుతో ఒక గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో రామాయణంలోని కొన్ని ముఖ్య సన్నివేశాలు, విజువల్స్, మరియు రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ లుక్స్‌ను చూపించింది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటున్నాయి. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.