Ramayana | ఈ మధ్య సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది. ముఖ్యంగా బాహుబలి తర్వాత నిర్మాతలకి కాన్ఫిడెంట్ ఎక్కువైంది. దీంతో బడా బడ్జెట్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్లో రూపొందుతోన్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ ను రూ. 1500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఇది వినే చాలా మంది షాక్ అయ్యారు. ఈ సినిమా కోసం అంత ఖర్చు చేశారా అనే కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమా బడ్జెట్ గణనీయంగా పెరిగిందట. రెండు భాగాలు కలిపి అక్షరాలా రూ. 4000 కోట్లు ఖర్చవుతుందని నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా వెల్లడించారు. ఇది దాదాపు 500 మిలియన్ డాలర్లకు సమానం అని ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నమిత్ మాట్లాడుతూ, ఇది నాతో పాటు భారతీయులు అందరు గర్వపడే ప్రాజెక్ట్ అవుతుంది. హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో విజువల్స్, టెక్నాలజీ, క్వాలిటీ ఉండేలా చూస్తున్నాం. ఈ మూవీ కోసం డబ్బు ఇతరుల దగ్గర నుంచి తీసుకోలేదు, నా స్వంత ఫైనాన్షియల్ సోర్సెస్ నుంచే పెట్టుబడి పెడుతున్నాను. అందుకే ఈ సంఖ్యలను బహిరంగంగా చెప్పగలుగుతున్నా’’ అని పేర్కొన్నారు. రామాయణను రెండు భాగాలుగా విడుదల చేయనుండగా, పార్ట్ 1 2026 దీపావళికి రానుంది పార్ట్ 2: 2027లో రిలీజ్ చేయనున్నారు. ఇతర బాలీవుడ్ ప్రొడ్యూసర్ల నుంచి వస్తున్న విమర్శలకు కంటెంట్ ద్వారానే సమాధానం ఇస్తానని నమిత్ చెబుతున్నారు. ‘‘ఇది లైఫ్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది’’ అని ధీమాగా చెప్పారు.
ఈ సినిమా కోసం గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఆస్కార్ అవార్డులు అందుకున్న ‘ప్రైమ్ ఫోకస్’ స్టూడియో పని చేస్తోంది. ఈ కంపెనీకి నమిత్ మల్హోత్రానే సీఈఓ, దాంతో VFX నాణ్యతపై ప్రేక్షకుల్లో భారీ నమ్మకం ఏర్పడింది. షూటింగ్ పూర్తయిన తర్వాత కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఒక సంవత్సరం సమయం కేటాయించనున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయీ పల్లవి సీతగా కనిపించి సందడి చేయనున్నారు. యశ్ రావణుడిగా కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఇండియన్ సినిమాకు కొత్త మైలురాయి అవుతుందా? లేదా? అనేది చూడాలి.