Oh Bhama Ayyo Rama | టాలీవుడ్ యువ హీరో సుహాస్ నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. ఈ చిత్రంలో జో సినిమాతో గుర్తింపు పొందిన మలయాళ నటి మాళవిక మనోజ్ తెలుగులో హీరోయిన్గా పరిచయం అవుతోంది. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘రామచంద్రుడే’ అంటూ సాగే అందమైన పెళ్లి పాటను మేకర్స్ విడుదల చేశారు. హీరో హీరోయిన్‌పై చిత్రీకరించిన ఈ పాటకు శ్రీ హర్ష ఈమని, పార్థు సన్నిధిరాజు సాహిత్యం అందించగా, టిప్పు అండ్ హరిణి టిప్పు ఆలపించారు. రథన్ అందించిన ఆహ్లాదకరమైన సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ పెళ్లి పాట అందరి హృదయాలను హత్తుకుంటుందని, తెలుగులో వచ్చిన ఉత్తమమైన పెళ్లి పాటల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని అన్నారు. సంగీత దర్శకుడు రథన్ లవ్ స్టోరీకి అద్భుతమైన సంగీతం అందించారని ఆయన కొనియాడారు. నిర్మాత హరీష్ మాట్లాడుతూ, తమ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎంతో సపోర్ట్ చేయడం వల్లే మంచి సినిమా వచ్చిందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించనుండటం విశేషం. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. సుహాస్, మాళవిక మనోజ్‌తో పాటు అనిత హస్సానందిని, అలీ, రవీందర్, విజయ్, బబ్లూ, పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎడిటర్‌గా భవిన్.ఎమ్.షా వ్యవహరిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.