Ram Pothineni | తెలుగు చిత్ర పరిశ్రమలో వినోదం, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి, తన ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో రామ్ పోతినేని కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఈ ఆసక్తికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ కాంబినేషన్ చాలా ఏళ్ల క్రితమే సెట్స్‌పైకి రావాల్సి ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో తెరకెక్కించిన రాజా ది గ్రేట్ కథను మొదట రామ్ పోతినేనిని దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేశారట. ఆ కథను రామ్‌కు వినిపించినప్పటికీ, అప్పట్లో వరుస మాస్ యాక్షన్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లలేదని సమాచారం.
తరువాత ఆ కథ హీరో రవితేజ వద్దకు వెళ్లి భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి రామ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, అనిల్ రావిపూడి ఇటీవల రామ్‌కు ఒక కొత్త కథా లైన్ వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, వాటిని పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది.అలాగే ఈ చిత్రాన్ని 2027 దసరా సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం రామ్ పోతినేని తన కెరీర్లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారు. ఆయన కెరీర్లో 23వ చిత్రంగా రూపొందనున్న RAPO 23 స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రంలో రామ్ ‘వీర’ అనే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు అనిల్ రావిపూడి కూడా భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. వెంకటేష్ దగ్గుబాటి, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.