హీరో రామ్ తన తాజా చిత్రం ‘ఆంధ్రకింగ్ తాలూకా’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేతో రామ్ ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. వీటిపై భాగ్యశ్రీ ఇప్పటికే స్పష్టతనిచ్చింది. తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని, ఇద్దరం మంచి స్నేహితులమని తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో రామ్ కూడా ఈ రూమర్స్‌పై స్పందించారు. ఈ సినిమా కోసం తానొక ప్రేమగీతాన్ని రాశానని, అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయని చెప్పారు.
‘ప్రేమలో ఉన్నారు కాబట్టే చక్కటి భావాలతో ఈ పాట రాశారు. లేకపోతే అంత గొప్పగా పాట రాయలేరు’ అని చాలా మంది అడుగుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..నేనీ పాట రాసే సమయానికి కథానాయికను ఎంపిక చేయలేదు. దర్శకుడు చెప్పిన సందర్భానుసారం పాట రాశాను’ అని రామ్ అన్నారు. దీంతో ఆయన డేటింగ్ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టినట్లయింది. మహేష్‌బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆంధ్రకింగ్ తాలూకా’ చిత్రంలో సినీ హీరో అభిమాని పాత్రలో రామ్ కనిపించనున్నారు.