Allu Arjun | సినీ నటుడు అల్లు అర్జున్‌కి హైదరాబాద్ రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు పంపారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళుతున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు బన్నీని రావోద్దని సూచించారు. ఒకవేళ పరమర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆయనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో ఆయన విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్‌కి కోర్టు పలు షరతులను విధించింది.