Ram Gopal Varma | భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ఆకట్టుకునే ఆర్జీవీ, ఈసారి బాలీవుడ్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో సంచలన విజయాలు అందుకున్న వర్మ..‘శివ’, ‘సత్యా’, ‘సర్కార్’ వంటి సినిమాలతో ఇండియన్ సినిమా హిస్టరీలో తన పేరు లిఖించుకున్నారు. నాగార్జునతో తీసిన శివ సినిమా తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసింది. హిందీలో సత్యా, సర్కార్ సినిమాలు బాలీవుడ్ సినిమాటిక్ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేశాయి.అయితే గత దశాబ్ద కాలంగా ఆర్జీవీ సినిమాలు అంచనాలకు తగ్గ స్థాయిలో ఆడడం లేదు.
ఎక్కువగా క్రైమ్, అడల్ట్ కంటెంట్‌తో కూడిన కథలను ఎంచుకోవడం వల్ల విమర్శలపాలయ్యారు. అయినా కూడా ఆయన తన ప్రయోగాత్మకతను ఆపలేదు. ఇప్పుడు మాత్రం మళ్లీ ఫుల్ ఫోకస్‌తో బాలీవుడ్ వైపు దృష్టి సారించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ ..నేను మళ్లీ బాలీవుడ్‌కి వెళ్తున్నాను. త్వరలోనే కొత్త హిందీ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నాను. ప్రస్తుతం నా పూర్తి ఫోకస్ ఆ ప్రాజెక్ట్‌పైనే ఉంది అని వెల్లడించారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందనున్న తాజా సినిమా ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ మనోజ్ బాజ్పేయీ, అందాల భామ జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని సమాచారం.
సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ ఆత్మగా మారి పోలీసులను వెంటాడతాడు. ఈ నేపథ్యంలో జరిగే సంఘటనలే సినిమా ప్రధాన అంశంగా తెలుస్తుంది. దెయ్యం సినిమాలు తీయడంలో రాంగోపాల్ వర్మ దిట్ట అనే విషయం మనకు తెలిసిందే. ఈయన రాత్రి, దెయ్యం, భూత్ వంటి సినిమాలని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించి ప్రేక్షకులకు దడ పుట్టించారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మే భూత్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది.