Orange Movie Re-Release | సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ చిత్రం ‘ఆరెంజ్’. రామ్‌చరణ్ హీరోగా పదమూడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని మూట గట్టుకుంది. ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్‌ను ప్రేక్షకులు లవ్‌స్టోరీలో చూడలేకపోయారు. పైగా రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై పాటలతో ఎక్కడలేని హైప్ వచ్చేసింది. హారిస్ జైరాజ్ పాటలతో పిచ్చెక్కించేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లే. అలా సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. తీరా రిలీజయ్యాక సినిమా బెడిసి కొట్టింది.
కథ కొత్తగానే ఉన్నా.. కథనం లోపించడం, పైగా ప్రేమ కొంత కాలమే ఉంటుంది అనే కాన్సెప్ట్ అప్పుడు అడ్వాన్స్ అనిపించడంతో ప్రేక్షకులకు ఎక్కలేదు. దాంతో సినిమా ఫలితం తలకిందులైంది. అయితే ఇప్పటికీ రామ్‌చరణ్‌కు తన సినిమాల్లో ఆరెంజ్ సినిమానే ఎక్కువ ఇష్టమని ఎన్నో సందర్భాల్లో తెలిపాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లను జనసేన పార్టీ ఫండ్‌కు ఇవ్వనున్నట్లు నిర్మాత, దర్శకుడు సాయి రాజేష్ తెలిపాడు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా జెనీలియా హీరోయిన్గా నటించింది. అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగబాబు ఈ సినిమాను నిర్మించాడు. అయితే అప్పట్లో ఈ సినిమా తెచ్చి నష్టాలు భరించలేక ఒకానొక సందర్భంలో సూసైడ్ చేసుకోవాలని అనిపించిందని నాగబాబు ఓ ఇంటర్వూలో వెల్లడించారు. అయితే అప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు తనకు తోడుగా నిలబడి సాయం చేశారని చెప్పాడు.
నిజానికి రామ్‌చరణ్ బర్త్‌డే కు ముందుగా ‘మగధీర’ను రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. గీతాఆర్స్ట సంస్థ అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చింది. కానీ మగధీర ప్రింట్కు సంబంధించిన సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆ సినిమాను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌ను తెచ్చిన సందర్భంలో రాజమౌళి, చరణ్‌ల ఇండస్ట్రీ హిట్ మగధీరను కూడా రిలీజ్ చేస్తే బాగుండేదని పలువురు నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు.