Ram Charan | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి తారాస్థాయికి చేరుకుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, సినిమా విడుదలకు ముందు నుంచే మెగా అభిమానులు థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతం మరోసారి అభిమానుల సందడికి కేంద్రబిందువుగా మారింది. టాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాల విడుదల సందర్భంగా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సాధారణమే. అయితే ఈసారి అభిమానులు మరింత ప్రత్యేకంగా ఆలోచించి, ‘పెద్ది’ సినిమాలో కనిపించే రామ్ చరణ్ పాత్రను ప్రతిబింబించేలా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అర్జున్ థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి అభిమానులు ‘శ్రీ రామ్ చరణ్ ఆలయం’ అనే పేరుతో ప్రత్యేక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రామీణ నేపథ్యంలోని ‘పెద్ది’ పాత్రను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు.అంతేకాకుండా కొందరు అభిమానులు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి, కర్పూర హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. డప్పులు, బ్యానర్లు, నినాదాలతో థియేటర్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.
‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ విజయానంతరం రామ్ చరణ్ నుంచి వస్తున్న పూర్తి స్థాయి రా అండ్ రస్టిక్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో చరణ్ కొత్త అవతారంలో కనిపించనున్నాడనే ప్రచారం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోలపై భారీ స్పందన కనిపిస్తుండగా, థియేటర్ల వద్ద అభిమానులు చేస్తున్న హంగామా చూస్తుంటే ‘పెద్ది’ విడుదల రోజు మెగా వేడుకలు మరింత భారీ స్థాయిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.