Ramcharan | రామ్‌చరణ్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో సినిమా దాదాపు ఖరారైంది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రశాంత్‌నీల్ ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలకు కమిటై ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. 2029లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇది మెగా అభిమానులకు నిజంగా శుభవార్తే.
ఇదిలావుంటే.. రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ సినిమాకు సంబంధించిన అప్డేట్లు రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్ని నింపేస్తున్నారు సంగీత దర్శకుడు తమన్. ‘గేమ్‌చేంజర్’ టీజర్ దసరాకు విడుదల కానుందని గతంలో వార్తలొచ్చాయి. దానిపై తాజాగా తన ఎక్స్(ట్విటర్) ద్వారా అభిమానులకు క్లారిటీ ఇచ్చారు తమన్. ‘దసరాకు టీజర్ లేదు. నిరాశ పడొద్దు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీపడటంలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నది. సీజీ, వీఎఫ్ఎక్స్ ఫైనల్ ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్‌గ్రౌండ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా విడుదలయ్యేవరకూ ప్రతి నెలా ఒక లిరికల్ సాంగ్‌ని ప్లాన్ చేశాం. ఈ నెల 30న మరో పాట రానుంది. అలాగే.. అభిమానుల కోసం ఈ దీపావళికి టీజర్ పక్కా. డిసెంబర్ 20న సినిమా విడుదల ఖాయం’ అని పోస్ట్ పెట్టి, అభిమానుల్లో ఆనందాన్ని నింపేశారు తమన్.