Ram Charan | అమెరికాలో స్థిరపడిన ప్రముఖ తెలుగు వ్యాపారవేత్త రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత విలాసవంతంగా జరిగింది. ఇండియాలో జరిగిన అత్యంత ఖరీదైన వెడ్డింగ్ ఈవెంట్స్‌లో ఒకటిగా ఈ వేడుక నిలిచిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ రాయల్ వేడుకకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయనేతలు, హాలీవుడ్,బాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. తెలుగు నుంచి ప్రత్యేకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే హాజరవటం విశేషం. బ్లాక్ సూట్లో చరణ్ ఎంట్రీ ఇవ్వడం ఈ గ్రాండ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో హాలీవుడ్ స్టార్, ఇంటర్నేషనల్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో రామరాజు మంతెనతో ఆమె దిగిన ఫోటో అభిమానులను ఆకట్టుకుంది. అనంతరం జరిగిన మ్యూజిక్, డాన్స్ సెషన్లో ఆమె హై ఎనర్జీ పర్ఫార్మెన్స్తో స్టేజ్‌ను షేక్ చేసింది. పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు ఇచ్చిన పవర్ ప్యాక్ షోలు వేడుక వాతావరణాన్ని మరింత హుషారుగా మార్చాయి. 56 ఏళ్ల వయసులోనూ ఆమె ఇస్తున్న ఎనర్జీకి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఆమె గ్లామరస్ కాస్ట్యూమ్స్‌పై కొంత విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. భారతీయ పెళ్లి వేడుకలో అలాంటి అవుట్‌ఫిట్స్ అవసరమా అని ప్రశ్నించారు.
మరోవైపు, నేత్ర మంతెన కుటుంబ నేపథ్యం కూడా ఈ పెళ్లి కారణంగా పెద్ద చర్చకు వచ్చింది. నేత్ర తండ్రి రామరాజు మంతెన ఇంజీనస్ ఫార్మాస్యూటికల్స్ అనే సంస్థకు చైర్మన్, సీఈఓ. ఈ సంస్థ అమెరికాలో కేంద్రంగా పనిచేస్తూ, స్విట్జర్లాండ్ మరియు భారతదేశంలో R&D సెంటర్లతో జెనరిక్ మెడిసిన్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది. అనేక మీడియా రిపోర్టులు ఆయనను బిలియనీర్ ఎంట్రప్రెన్యూర్‌గా పేర్కొన్నప్పటికీ ఫోర్బ్స్ అధికారిక బిలియనీర్స్ జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఆసక్తికర అంశం. వరుడు వంశీ గడిరాజు Superorder అనే సాఫ్ట్వేర్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు. ఇక ఈ ఖరీదైన పెళ్లిలో రామ్ చరణ్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్లతో సరదాగా గడుపుతున్న ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, కృతి సనన్, జాన్వీ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధవన్, నోరా ఫతేహి వంటి స్టార్లు హాజరై సంగీత్ నైట్‌లో స్టేజ్‌పై దుమ్మురేపారు. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరై వేడుకలో సందడి చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.