Ram Charan | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వంటి డిజాస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ది అనే టైటిల్‌తో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. ఈ ఏడాది చివరికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక చరణ్ వెంటనే తన తదుపరి ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు. బుచ్చిబాబు సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమా కంటే ముందు మరో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చరణ్ అనుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వివిధ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు.
తాజాగా ప్రశాంత్ నీల్ – రామ్ చరణ్ కాంబినేషన్ పై మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో రామ్ చరణ్ సినిమా ఖరారైందని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుందంటూ ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసింది.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పూర్తిగా ఎన్టీఆర్‌తో చేస్తున్న “డ్రాగన్” సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా 2026 జూన్‌లో విడుదల కానుంది. అనంతరం ఆయన ప్రభాస్‌తో సలార్ 2, యశ్‌తో కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్స్ తెరకెక్కించనున్నాడు. ఇవన్నీ ముందుగానే ప్రకటించిన ప్రాజెక్టులే కావడంతో, ఇప్పుడు కొత్త సినిమాలపై ఆయన ఎలాంటి ఫోకస్ పెట్టడం లేదు.
అంతేకాదు, రామ్ చరణ్ – ప్రశాంత్ నీల్ కలయికపై ఇప్పటి వరకు ఎలాంటి కథా చర్చలు జరగలేదని, కథ చెప్పినట్టూ, చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వస్తున్న వార్తలన్నీ పూర్తిగా రూమర్స్ మాత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్, తన తదుపరి సినిమా కోసం పలు కథలు వింటున్నాడు. మొత్తానికి, రామ్ చరణ్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని కలిగించినా, ప్రస్తుతానికి అటువంటి ప్రాజెక్ట్ ఫిక్స్ కాలేదు. అయితే చరణ్ .. సుకుమార్ సినిమా ముందు ఏ దర్శకుడిని ఫైనల్ చేస్తాడో చూడాలి.