Ram Charan |ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన సినిమాల ద్వారా విజువల్ గ్రాండియర్‌కు కొత్త అర్థం తీసుకొచ్చిన వ్యక్తిగా పేరు పొందారు. ఆయన తెరకెక్కించే ప్రతి చిత్రం విజువల్ వండర్‌గా నిలుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో భన్సాలీ ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ మైథోలాజికల్ జంగిల్ డ్రామాను పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో మిత్రన్ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అడవి నేపథ్యంలో సాగే పౌరాణిక గాథను అత్యాధునిక సాంకేతికతతో, భన్సాలీ స్టైల్ గ్రాండియర్‌తో తెరకెక్కించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరును పరిశీలించినట్లు సమాచారం. ఈ పాత్రకు ఆయన సరిపోతారని భావించినప్పటికీ, పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆయన చేతిలోకి రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అవకాశం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ని వరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ తన విభిన్నమైన పాత్రల ఎంపికతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ప్రత్యేకంగా కంటెంట్ ఆధారిత సినిమాల్లో తనదైన ముద్ర వేసిన ఆయనకు ఈ మైథోలాజికల్ పాత్ర మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పాత్రకు అవసరమైన నటన, యాక్షన్, భావోద్వేగాలను సమర్థంగా ప్రదర్శించగల సామర్థ్యం ధనుష్‌లో ఉందనే నమ్మకంతోనే భన్సాలీ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
ఈ సినిమా కథాంశం పురాణ కాలం నేపథ్యంలో అడవిలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని సమాచారం. గ్రాండియర్ విజువల్స్, శక్తివంతమైన కథనం, సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ నుంచి ధనుష్ చేతికి వెళ్లిన ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇటు దక్షిణాది, అటు బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, ఈ మైథోలాజికల్ జంగిల్ డ్రామా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.