రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. బాలీవుడ్ తార కియారా అద్వానీ నాయికగా కనిపించనుంది. శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. జీనియస్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. సామాజిక, రాజకీయ అంశాలు కలిసిన ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ పాత్రల్లో రామ్‌చరణ్ లుక్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయని అంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్నది. స్టార్ హీరో సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ఉండే ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. రామ్‌చరణ్ సినిమాలో ఈ విరామ సన్నివేశాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారట దర్శకుడు శంకర్. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందని సమాచారం. సినిమాకే ఇది హైలైట్ అవుతుందని చిత్రబృందం భావిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.