Ram Charan | మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన క్లాసిక్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం నేటితో 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్ చేస్తున్నారు. 2డీ,3డీలో ఈ మూవీ థియేటర్స్‌లో సందడి చేయనుంది. అయితే ఈ మూవీకి ప్రచారాలు బాగానే చేశారు. చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు నాటి విషయాల్ని పంచుకున్నారు. ఇవి సినీ ప్రియులకి మంచి మజాని అందించాయి.
ఈ రీ రిలీజ్లో శ్రీదేవీ గారిని చాలా మిస్ అవుతున్నాం. ఈ రీ రిలీజ్ ఆమెకు అంకితం అని చిరంజీవి అన్నారు. ఎంతో శక్తి ఉన్న ఆ రింగుని చేప మింగిన తరువాత ఏం జరిగింది? అనే పాయింట్‌ను అప్పుడే ఎండ్ కార్డులో వేసి ఉంటే సీక్వెల్ ఎప్పుడో వచ్చేది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తే అందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని ఉంది. ఇక ఆ మూవీని రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ తీస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను అని చిరంజీవి అన్నారు. అశ్వనీదత్ గారి పిల్లలు ఎలాగూ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తారు , ఇప్పటి తరం ఆ మూవీని థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేసి ఉండరు. ఇప్పటి తరం ఈ రీ రిలీజ్‌ను ఎంజాయ్ చేయండని చిరు చెప్పుకొచ్చారు.
ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ.. మా తరానికి అసలు సిసలు సోషియో ఫాంటసీ అంటే ఈ సినిమానే.. నాకు ఆ ఆంజనేయుడి మీద ఏ వయసులో ఎలా భక్తి మొదలైందే అంత కచ్చితంగా చెప్పలేను గానీ.. ఈ చిత్రంలో జై చిరంజీవ అనే పాటను చూసిన తరువాత నాకు భక్తి మొదలైనట్టుగా గుర్తుంది.. ఇది డ్రీమ్ టీం అని మా తరం అంతా నమ్ముతుంది.. లెజెండ్స్ అంతా కలిసి ఈ చిత్రం కోసం పని చేశారు. చిరంజీవి గారు, శ్రీదేవీ గారు, రాఘవేంద్రరావు గారు, అశ్వనీదత్ గారు, ఇళయారాజా గారు, యండమూరి గారు, పరుచూరి గారు, విన్సెంట్ గారు ఇలా అందరూ లెజెండ్స్ కలిసి పని చేశారు.. మళ్లీ ఈ టీం అంతా కలిసి పని చేయలేదు కాబట్టి డ్రీమ్ టీం అంటున్నా. అయితే చిత్రంలో చివర్లో చూపించినట్టుగా.. ఆ రింగు ఏమైంది? ఆ చేప ఎక్కడుంది? అనే విషయాలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి.. ఇది రిక్వెస్ట్ కాదు.. ఇది మా డిమాండ్’ అని అన్నాడు రామ్ చరణ్. ఈ హంగామా చూస్తుంటే సీక్వెల్ త్వరలో సెట్స్ పైకి వెళ్లిన ఆశ్చర్యపోనక్కర్లేదు.