ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు తన గుర్తింపు కోసం ఎలా పోరాటం చేశాడన్నదే ‘పెద్ది’ సినిమాలో ప్రధానాంశమని, మట్టి వాసనలు వెదజల్లే ఈ కథ ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తినింపుతుందని అన్నారు చిత్ర కథానాయకుడు రామ్చరణ్. ఆయన నటించిన పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.
ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్చరణ్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘గతంలో నేను చేసిన రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. అదే కోవలో ‘పెద్ది’ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. భారతదేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లందరూ ట్రైబల్ ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లే.
ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ‘పెద్ది’సినిమా కాన్సెప్ట్ ఏమిటని అడిగారు. గ్రామాల సాధికారత గురించి చర్చించే స్ఫూర్తివంతమైన కాన్సెప్ట్ అని చెప్పాను. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. తప్పకుండా వారు ఇన్స్పైర్ అవుతారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయిక జాన్వీకపూర్, నటులు బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, నిర్మాత వెంకట సతీశ్ కిలారు పాల్గొన్నారు.