74ఏండ్ల వయసులో కూడా క్షణం తీరిక లేకుండా షూటింగుల్లో పాల్గొంటూ న్యూ జనరేషన్‌కి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. మొన్నటివరకూ ఆయన ‘కూలీ’ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించిన తన పార్ట్ కంప్లీటయ్యిందో లేదో.. వెంటనే ‘జైలర్ 2’ షూటింగ్‌ని మొదలుపెట్టేశారు తలైవా. ఆదివారం చెన్నైలో షూటింగ్ మొదలైంది. రెండు వారాలపాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని, రెండో షెడ్యూల్ ఏప్రిల్‌లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఫస్ట్ పార్ట్ ‘జైలర్’ రజనీకాంత్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్ అనగానే ‘జైలర్ 2’పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. తొలి పార్ట్‌లో నటించిన రమ్యకృష్ణ, వినాయకన్, యోగిబాబు, తమన్నా.. ఇందులో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్‌లో మాదిరిగానే ఈ సెకండ్ పార్ట్‌లో కూడా వివిధ భాషల నుంచి కొందరు స్టార్లు మెరవనున్నారని టాక్. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.