ఇటీవల విడుదలైన ‘జైలర్’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో రజనీకాంత్. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ దక్కుతున్నది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి సన్నద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న 170 సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.
‘జై భీమ్’ ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఓ బలమైన సామాజికాంశంతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలిసింది. ఇందులో అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. తెలుగు యువ హీరో శర్వానంద్ కీలకమైన అతిథి పాత్రకు ఎంపికయ్యారు. నేడు ఈ చిత్రాన్ని చెన్నైలో లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.