రజనీకాంత్ సినిమా అంటే అభిమానులకు పండగే. ‘జైలర్’ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాగా ‘వేట్టయన్’ అందరిదృష్టిని ఆకర్షించింది. దీంతో పాటు అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ లాంటి స్టార్స్ చేరడం మరో ఆకర్షణ. పైగా జైభీమ్ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన జ్ఞానవేల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో వేట్టయన్ పై అంచనాలు పెరిగాయి. మరా అంచనాలను రజనీ అందుకున్నాడా? ఇంతకీ ‘వేట్టయన్’ కథ ఏమిటి ?
కథ: అథియన్(రజనీకాంత్) ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసి చట్టం నుంచి తప్పించుకునే వాళ్ళని తన తూటాలతో శిక్షిస్తుంటాడు. శరణ్య (దుశారా విజయన్) అనే స్కూల్ టీచర్ దారుణంగా హత్యకి గురౌతుంది. ఈ కేసులో ఓ నిందితుడుని పట్టుకుంటారు పోలీసులు. అయితే ఆ నిందితుడు తప్పించుకోవడంతో ప్రభుత్వంపైనా, పోలీసు యంత్రాంగంపైన ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అథియన్ రంగంలోకి దిగుతాడు. మరి హంతకుడిని మట్టు బెట్టాడా? ఈ కేసులో అసలు హంతకుడు ఎవరు? ఈ కథలో సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్) నటరాజ్ (రానా దగ్గుబాటి ) పాత్రలు ఏమిటి? చివరికి శరణ్యకి న్యాయం జరిగిందా లేదా అనేది కథ.
కథా విశ్లేషణ: న్యాయం, విద్య లాంటి సామజిక అంశాలని ఓ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి ముడిపెట్టి మలిచిన సినిమా వేట్టయన్. గవర్నమెంట్ స్కూల్ పిల్లల వైరల్ వీడియోలని చూపిస్తూ కథ మొదలౌతుంది. ఇక్కడే ఈ కథలోని ఎడ్యుకేషన్ కోణానికి బీజం వేశాడు దర్శకుడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీ పాత్రని పరిచయం చేసిన తీరు, యాక్షన్ సీక్వెన్స్, తర్వాత వచ్చే పాట ఫ్యాన్స్ ని జోష్ ఇస్తాయి. శరణ్య పాత్రతో ఈ కథలో కాన్ ఫ్లిక్ట్ తెరపైకి వస్తుంది. ఆమె హత్యతో కథ కీలకమలుపు తీసుకుంటుంది. తర్వాత క్రైమ్ థ్రిల్లర్ ని తలపించే సన్నివేశాలతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి.
సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఈ కథలో చరుకుదనం తగ్గుతుంది. కథనం అంతా ఊహకు ముందే అందిపోతుంది. రజనీ, రానా మధ్యవచ్చే సన్నివేశాలు కొన్ని ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఈ కథ మొత్తం అప్పటికే రివిల్ అయిపోవడంతో మిగతా సన్నివేశాలు అంతగా రక్తికట్టవు. దీంతో పాటు ఎడ్ టెక్ కంపెనీ చుట్టూ నడిపిన సీన్స్ ఒక దశలో బోరింగ్ గా అనిపిస్తాయి. వీటిని ఇంకాస్త పదునుగా చెప్పాల్సింది. ఈ కథలో సబ్ ప్లాట్ లేకపోవడం మరో వెలితి. మొత్తం సినిమా సింగిల్ థ్రెడ్ మీద నడపడం, చివర్లో సామాజిక సందేశం ఎక్కువైపోవడంతో ప్రేక్షకుడి ఆసక్తి సన్నగిల్లుతుంది.
నటీనటులు నటన: రజనీకాంత్ తనదైన శ్వాగ్ చూపించారు. నిజానికి రజనీ మార్క్ కథ కాదిది. అయినప్పటికీ ఉన్నంతలో తన మ్యాజిక్ ని చూపించారు. రజనీ మార్క్ ఫైట్స్ వుంటాయి. తన వయసుకు తగ్గ పాత్రే. అమితాబ్ బచ్చన్ తన అనుభవం చూపించారు. ఆ పాత్రని చాలా హుందాగగా చేశారు. ప్యాట్రిక్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ ఆకట్టుకుంటాడు. మంజువారియర్ ది చిన్న పాత్రే. రానా దగ్గుబాటి స్టయిలీష్ విలనిజం చూపించారు. దుశారా విజయన్ చాలా నేచురల్ గా కనిపించారు. ఆమె పాత్రకు మంచి మార్కులు పడతాయి. మిగతా నటులు పరిధిమేర కనిపంచారు.
టెక్నికల్: అనిరుద్ బీజీఎం బావుంది. రజనీ మార్క్ ఎలివేషన్ సౌండ్స్ ఇవ్వగలిగాడు. కెమరాపనితనం, నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా వుండాల్సింది. ‘గురిపెడితే ఎర పడాల్సిందే’ డైలాగ్ పేలింది.
ప్లస్ పాయింట్స్
రజనీకాంత్, అమితాబ్, రానా, ఫహద్
కథా నేపధ్యం, ఫస్ట్ హాఫ్
బీజీఎం, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
ఊహకు అందిపోయే కథనం
రేటింగ్: 2.75/5