Rajinikanth-Nelson Kumar Movie | సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు తెలియని సినీప్రేక్షకుడు ఉండడేమో. సౌత్ నుంచి నార్త్ వరకు సినీ ప్రముఖులు సైతం ఈయనకు వీరాభిమానులే. అయితే గత కొంత కాలంగా రజినీకాంత్ నుంచి అభిమానులు ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి ‘రోబో’ తరువాత ఇప్పటివరకు రజినీకి ఆ స్థాయి హిట్ లేదు. మధ్యలో భారి అంచనాలతో విడుదలైన ‘కబాలి’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే 2019లో వచ్చిన ‘పేట’ మాత్రం మంచి విజయం సాధించింది. కానీ అభిమానులకు మాత్రం ఫుల్ మీల్స్ పెట్టలేకపోయింది.
ఇక దీని తర్వాత వచ్చి న ‘దర్బార్’, ‘పెద్దన్న’ సినిమాలు పరాజయాలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం రజినీ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే నెల్సన్‌తో చేతులు కలిపాడు. ‘డాక్టర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్.. బీస్ట్ వంటి భారీ ఫ్లాప్ కూడా ఇచ్చాడు. అయినప్పటికి రజినీకాంత్, నెల్సన్‌తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ చిత్రానికి రజినీ స్వయంగా కథను అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, రమ్య కృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్, శివరాజ్‌కుమార్ వంటి అగ్ర తారలు నటించనున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో షూటింగ్ మొదలు పెట్టనుంది.