Rajinikanth | లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తన మ్యూజిక్ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఆయనకు ఘనంగా సత్కారం చేసింది. లండన్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజినీకాంత్, విశ్వరూప నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంగీత ప్రేమికులకు మధురానుభూతుల్నిఅందించిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, మ్యూజిక్ ప్రియులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో రజినీకాంత్ చేసిన ఓ సరదా కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “జానీ” సినిమా షూటింగ్ టైమ్‌లో మద్యం సేవించిన తర్వాత ఏం జరిగిందో చెప్పి రజనీకాంత్ నవ్వులుపూయించారు.
రజినీకాంత్ మాట్లాడుతూ.. “జానీ సినిమా టైమ్‌లో నేను, డైరెక్టర్ మహేంద్రన్ రాత్రిళ్లు మందు కొట్టేవాళ్లం. ఆ టైమ్‌లో ఇళయరాజా గారు కూడా మాతో జాయిన్ అయ్యారు. ఒకసారి సగం బాటిల్ తాగిన తర్వాత ఆయన ఇచ్చిన మ్యూజికల్ పర్ఫార్మెన్స్ అసాధారణం. అర్ధరాత్రి 3 గంటల దాకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. మహేంద్రన్ మ్యూజిక్ ఎంత వరకు వచ్చింది అని అడిగితే… మూసుకుని కూర్చో అని చెప్పాడు. అంతేకాదు, హీరోయిన్ల గురించి గాసిప్స్ కూడా చెప్పారు అంటూ సరదా కామెంట్స్ చేశారు. రజినీ కామెంట్లకు వెంటనే స్పందించిన ఇళయరాజా..రజినీ, జరిగిన దానికి కొంచెం మసాలా కలిపారు అంటూ కవర్ చేశారు.
కాగా, 1980లో మహేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘జానీ’ చిత్రంలో రజినీకాంత్ డ్యూయెల్ రోల్లో నటించాడు. శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదటి రెండు వారాలు పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయినా, మూడో వారం నుంచి తిరిగి పుంజుకుని థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడి కమర్షియల్ సక్సెస్ సాధించింది. కాగా, 2018 లో నటించిన ‘కాలా’లో మద్య వ్యసనం సమస్యను ప్రస్తావించగా, ఆ పాత్రలో తాగి ఉన్నప్పుడు అతని అజాగ్రత్త ఫలితంగా తన భార్యను కోల్పోతాడు. మద్యం, సిగరెట్లను ప్రతికూలంగా చిత్రీకరించడం ప్రారంభించిన రజనీకాంత్ రియల్ లైఫ్ పైనా ఇది తీవ్ర ప్రభావం చూపింది. దీంతో అప్పట్నుంచి అతను గతంలో చేసిన వాటిని కేవలం స్టైల్ స్టేట్మెంట్లుగా ఉపయోగించకుండా వాటికి దూరంగా ఉంటున్నాడు.