Rajinikanth | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. చిత్ర రిలీజ్ మరి కొద్ది రోజులే ఉండడంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఈ ట్రైలర్ సినీ ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు రిలీజ్‌కి ముందే ఈ మూవీ సినీ ప్రముఖుల ప్రశంసలు సొంతం చేసుకుంటుండడం విశేషం. ముఖ్యంగా, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించి, టీమ్‌ను అభినందించారు. ఈ విషయాన్ని మంచు విష్ణు సోమవారం తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకున్నారు. రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోలతో పాటు, ఆ మధురానుభూతిని అభిమానులతో షేర్ చేశారు.
“రజనీకాంత్ అంకుల్ నిన్న రాత్రి ‘కన్నప్ప’ సినిమా చూశారు. సినిమా పూర్తయ్యాక ఆయన నన్ను హత్తుకున్నారు. సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఒక నటుడిగా ఈ హాగ్ కోసం 22 ఏళ్లుగా ఎదురుచూశాను. ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఆయన నన్ను ఎంకరేజ్ చేసినట్లు అనిపిస్తుంది. కన్నప్ప జూన్ 27న వస్తోంది. ప్రపంచం శివుని మాయాజాలం అనుభూతి పొందేలా చేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా తరువాత రజినీకాంత్, మోహన్ బాబు కలిసి కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
శైవ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన కన్నప్ప చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. విశిష్టమైన తారాగణంతో ఈ చిత్రం రూపొందగా, ఇందులో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి అగ్రతారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ వంటి లెజెండరీ నటుడు అభినందించడం సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. గత కొన్నేళ్లుగా మంచు విష్ణు ఒక మంచి హిట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఇటీవలి కాలంలో విష్ణు నటించిన ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలన్న పట్టుదలతో విష్ణు కన్నప్పను మొదలుపెట్టాడు. ఈ మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.