రెండు సింహాలు తలపడితే చూడ్డానికి భలే ఉంటుంది. ఆ పోరాటంలో ఏ గెలుపూ మనకు ఆనందాన్నివ్వదు. కేవలం ఆ ఫైటే కావాల్సినంత కిక్కిస్తుంది. ఇలాంటి ఓ యుద్ధానికి వెండితెర సిద్ధమవుతున్నట్టు ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించబోతున్నారు. దశాబ్దాల తర్వాత ఈ రెండు సింహాలు వెండితెర వేదికగా తలపడనున్నాయి. ఈ ఇద్దరినీ ఒకే కథలో భాగం చేసే సాహసం చేసిన దర్శకుడెవరో కాదు.. లోకేష్ కనకరాజ్. ‘కూలీ’తో రజనీకాంత్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టిన లోకేష్.. ఇప్పుడు తలైవాకు లోకనాయకుడ్ని జత చేసి, రికార్డుల వేటకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
నిజానికి రజనీకాంత్ కెరీర్ మొదలైందే కమల్‌హాసన్‌తో. రజనీ తొలి సినిమా ‘అపూర్వరాగంగళ్’లో హీరో కమల్‌హాసనే. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి దాదాపు ఓ డజన్ సినిమాల్లో నటించారు. తమిళనాట ప్రాణస్నేహితులుగా పేరు గడించారు. బాలీవుడ్లో అమితాబ్ హీరోగా రూపొందిన ‘గిరఫ్తార్'(1985) సినిమాలో వారిద్దరూ చివరిసారిగా కలిసి నటించారు. వినిపిస్తున్న వార్త నిజమైతే.. 40ఏండ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ సింహాలు తలపడనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులందరికీ ఇది నిజంగా శుభవార్తే.