shivani rajasekhar | కథ, పాత్ర నచ్చితే గ్లామర్ రోల్స్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పింది శివానీ రాజశేఖర్. సీనియర్ హీరో రాజశేఖర్ తనయగా చిత్రసీమలో అడుగుపెట్టిన శివానీ ‘అద్భుతం’ సినిమాతో కథానాయికగా పరిచయమవుతోంది. ఈ నెల 19న ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో శివానీ రాజశేఖర్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలి సినిమా విడుదలకాబోతుండటం ఎలాంటి అనుభూతిని పంచుతుంది?
ఘనమైన సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా నాకు అవకాశాలు అంత సులభంగా రాలేదు. నేనూ, చెల్లి చాలా సినిమాల ఆడిషన్స్‌కు హాజరయ్యాం. తిరస్కరణలను ఎదుర్కొన్నాం. ఎన్నో అవరోధాలను దాటుకొని సినిమాలు చేస్తున్నాం. 2018లో తొలుత ‘టూస్టేట్స్’ రీమేక్ అంగీకరించా. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడంతో చాలా బాధపడ్డా. ఆ తర్వాత విష్ణువిశాల్‌తో ఓ తమిళ సినిమా చేసే అవకాశం వచ్చింది కానీ హీరోకు ప్రమాదం జరగడం ఆ తర్వాత ఇతర షూటింగ్‌లతో అతడు బిజీగా మారడంతో ఆ సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. ‘కల్కి’ షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఈ కథ వినిపించారు. బాగా నచ్చడంతో కథానాయిక పాత్రను నేనే చేస్తానని దర్శకనిర్మాతల్ని అడిగా. వారు అంగీకరించారు. అలా ఈ అవకాశం వచ్చింది. చదవండి : గుర్తుపెట్టుకోండి.. మంచిరోజులు వస్తాయి.. వైరల్‌గా మారిన సమంత పోస్టు
ఈ సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకున్నఅంశాలేవి?
ఒకే ఫోన్ నంబర్ కలిగిన ఓ అబ్బాయి, అమ్మాయి కథ ఇది. అది ఎలా సాధ్యమైందనేది ఆసక్తికరంగా ఉంటుంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ఊహకందని మలుపులతో ఉత్కంఠను పంచుతుంది. ఇందులో వెన్నెల అనే యువతిగా నటనకు ఆస్కారమున్న మంచి పాత్రను చేశా. కథానాయికగా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందనే నమ్మకముంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల జాబితాలో ఇది నిలుస్తుంది. బిగ్‌స్క్రీన్‌లో సినిమాను చూడలేకపోతున్నాననే బాధ నాకు ఉంది. అయితే ఇప్పుడు ఓటీటీ మాధ్యమాలకు ఆదరణ పెరిగింది. మంచి కథాంశాలతో సినిమాలు రూపొందుతున్నాయి. ఆ కోవలో మా సినిమా నిలుస్తుంది.
అరంగేట్రం సినిమా విషయంలో అడ్డంకులు ఎదురవ్వడం మిమ్మల్ని బాధించిందా?
స్టార్ కిడ్స్ స్ట్రగుల్స్ లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదు. కెరీర్ ఆరంభంలోనే అవాంతరాలు ఎదురైతే ఇండస్ట్రీలో బ్యాడ్‌లక్, ఐరన్‌లెగ్ అనే ముద్రలు వేస్తుంటారు. ఏ సినిమా మొదలుపెట్టినా ఆగిపోవడంతో నాకు నేనే ఐరెన్‌లెగ్‌గా భావించుకున్నా. డిప్రెషన్లోకి వెళ్లిపోయా. కానీ అమ్మానాన్నల ప్రోత్సాహం, ధైర్యం వల్లే కష్టాల్ని సవాల్‌గా స్వీకరించి ధైర్యంగా నిలబడ్డా. ‘మా అందరిలోకెల్లా బిజీగా ఉన్నది నువ్వే. కానీ నీ సినిమా మాత్రం విడుదలకావడం లేదు’ అంటూ నాన్న ఆటపట్టించేవారు. ఇక నుంచి నా కెరీర్ మారుతుందని ఆశిస్తున్నా.
నటనతో పాటు చిత్రనిర్మాణ వ్యవహారాలపై దృష్టిపెడుతున్నారు?ఎందుకలా?
చిన్నతనం నుంచి ఇల్లు, స్కూల్లో కంటే షూటింగ్ లొకేషన్స్‌లోనే నేను, చెల్లి ఎక్కువగా గడిపేవాళ్లం. అందువల్ల నటనతో పాటు సినిమాలకు సంబంధించిన 24 విభాగాలపై పరిజ్ఞానం వచ్చింది. అది మాకో గొప్ప వరంగా భావిస్తున్నాం. ‘గరుడవేగ’ నుంచి నాన్న సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్, ప్రీప్రొడక్షన్, పోస్ట్‌ప్రొడక్షన్స్ పనుల్లో అమ్మకు మేము సహాయపడటం ప్రారంభించాం. షూటింగ్స్ లేకపోతే సెట్స్‌కు వెళ్లిపోయి నిర్మాణ పరమైన వ్యవహారాల్లో నిమగ్నమైపోతుంటాం.
సినీ నేపథ్యాన్ని ప్లస్ అనుకుంటున్నారా? మైనస్‌గా భావిస్తున్నారా?
కుటుంబ నేపథ్యం వల్ల ప్లస్లతో పాటు మైనస్‌లు ఉన్నాయి. మిగతా కథానాయికల మాదిరిగా మేము గ్లామర్ రోల్స్ చేస్తామా లేదా అనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. చిన్న సినిమాలు చేయమని, రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతామనే సంశయాలున్నాయి. అలాంటి ఆలోచనలు మాకు ఎప్పుడూ లేవు. కథ, పాత్రలు బాగుంటే ఏ సినిమానైనా చేయడానికి నేను, శివాత్మిక సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం తెలుగులో ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ సినిమా చేస్తున్నా. షూటింగ్ పూర్తయింది. తమిళంలో ఉదయనిధిస్టాలిన్, హిప్హాప్ తమిళతో సినిమాల్ని అంగీకరించా. నాన్న రాజశేఖర్ నటిస్తున్న ‘శేఖర్’ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. మరో మూడు నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. సంక్రాంతికి విడుదలచేసే ఆలోచనలో ఉన్నాం. ‘గతం’ చిత్ర దర్శకుడు కిరణ్‌తో నాన్న ఓ సినిమా చేయబోతున్నారు.
శివాత్మిక రూపంలో మీకు ఇంట్లోనే పోటీ ఉన్నట్లుంది?
చెల్లిని నేను ఎప్పుడూ పోటీగా భావించను. మంచి స్నేహితుల్లానే ఉంటాం. ఇద్దరం నటననే ఎంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాలకు సంబంధించి అన్ని విషయాల్ని చర్చించుకుంటాం. నేను ఎప్పుడైనా బ్యాడ్మూడ్లోకి వెళితే చెల్లి నాలో ఉత్సాహాన్ని నింపుతుంటుంది. చెల్లి ‘దొరసాని’ చిత్రంతో నాకంటే ముందుగానే సినిమాల్లోకి వచ్చింది. ఆ విషయంలో నేను హ్యాపీగా ఫీలయ్యా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Adbhutam | తేజ సజ్జా అద్భుతం ఓటీటీలోనే రిలీజ్… వచ్చేది ఎప్పుడంటే..
Varadharajan Gopal | హీరో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ కన్నుమూత
Tollywood | మళ్లీ అలాంటి పాత్రలు ఒప్పుకుంటున్న రాజశేఖర్ !
Shivathmika Rajashekar | నేనేం తక్కువ.. శివాత్మిక రాజశేఖర్ ఫొటోస్..
Shivathmika Rajashekar: రాజశేఖర్ కూతురు అందం చూడతరమా